KCR -Keshava Raoతెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు వివిధ సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు మనసు గెలుచుకున్నా ప్రజలకు అందుబాటులో ఉండరు అనే అపవాదు ఆయన మీద ఎప్పుడూ ఉంటుంది. అది ఇప్పుడు మరింత ముదిరినట్టుగా కనిపిస్తుంది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ, కె కేశవరావు సైతం కేసీఆర్ తనకు అందుబాటులో లేరని అనడం గమనార్హం.

ఒకపక్క ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు లేవు అంటే, కేకే మాత్రం చర్చలకు రావాలని ఒక బహిరంగ లేఖ ద్వారా పిలుపునిచ్చారు. అయితే కేకే లేఖ ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించిందట. “‘‘నేను సోషలిస్టును. రాజ్యం వైపు ఎప్పుడూ ఉండను. కార్మికుల వైపే ఉంటాను. ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు బాధించాయి. ప్రభుత్వం, ఆర్టీసీ నడుమ చర్చలు జరగాలి. ప్రస్తుతం సీఎంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. ఇంకా సీఎం అందుబాటులోకి రాలేదు,” అని కేకే సంజాయిషీ చెప్పుకోవాల్సి వచ్చింది.

కేకే లాంటి సీనియర్ నేతకే ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోతే అది ఖచ్చితంగా అభ్యంతరకరమే. మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరింది. 48,660 కార్మికులను ఒక్కసారిగా ఉద్యోగాలనుండి తొలగించి సమస్యను మరింత జటిలం చేసింది.

కార్మికులు కూడా ఇప్పుడు అంతే పంతంతో ఉన్నారు.ఇప్పటికే ఇద్దరు కార్మికులు బలిదానాలు చేసుకున్నారు. ఈ నెల 19న రాష్ట్రవ్యాప్తంగా బందు కు పిలుపునిచ్చారు. నిన్న హై కోర్టు కార్మికులతో చర్చలు చేపట్టాలని ఆదేశించడంతో ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో చూడాలి.