YS- Jagan-KCRతెలంగాణ ఆవిర్భవించిన నాటి నుండి తెలంగాణలో ఇప్పటివరకు పెద్ద సమ్మె అనేది ఏదీ లేదు. ఒకరకంగా దానికి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఒక కారణమే. ప్రభుత్వ ఉద్యోగులు అడిగింది లేదనకుండా, కాదనకుండా ఇచ్చి వారిలో తెరాస పరపతి పెంచే ప్రయత్నం చేశారు కేసీఆర్. అయితే ఇప్పుడు ఉన్నట్టుంది పరిస్థితి మారిపోయింది. ఆర్టీసీ ఉద్యోగులు నేటి నుండి సమ్మెకు దిగారు.

దసరా, బతుకమ్మ పండుగల సమయంలో సమ్మె ప్రభుత్వానికి చిరాకు రప్పిస్తుంది. కార్మిక సంఘాలతో ఇక పై చర్చలు ఉండవని, శనివారం సాయంత్రం 6 లోపు విధుల్లో చేరని వారిని ఉద్యోగాల నుండి తొలగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకావడం విశేషం.

ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నా సంస్థను ప్రభుత్వంలో విలీనం పైనే ఎటు తేలలేదు. పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ఇటీవలే ఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాని ఒక కమిటి వేశారు. తెలంగాణ ఆర్టీసీ వారు కూడా ఇప్పుడు అదే కావాలని పట్టుబడుతున్నారు.

అది ఆచరణ సాధ్యం కాదని కేసీఆర్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. పైగా ఇప్పుడు ఈ డిమాండ్ కు ఒప్పుకోవడానికి రాజకీయాలలో చాలా జూనియరైన, నిన్న కాక మొన్న సీఎం కుర్చీలోకి వచ్చిన జగన్ ను ఫాలో అవ్వడానికి కేసీఆర్ అహం అడ్డువస్తుంది. దీనితో ఈ డిమాండ్ కు కేసీఆర్ ఒప్పుకోవడం లేదు. మరోవైపు తెరాసను సమర్ధించే ఒక కీలకమైన వర్గంలో చీలిక రావడం, కేసీఆర్ తగ్గుతున్న పరపతికి చిహ్నం అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.