kcr nitish kumar mamata benarjee in pm race what they will doదేశ ప్రజలు తెలంగాణ సిఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని, ఆయన ప్రధానమంత్రి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని టిఆర్ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పదేపదే చెపుతున్నారు. అంటే ప్రధానమంత్రి రేసులో కేసీఆర్‌ ఉన్నారని స్పష్టమవుతోంది. మా ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో రైతులందరికీ 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందిస్తామని కేసీఆర్‌ ఇటీవలే ప్రకటించారు.

బిహార్‌ సిఎం నితీశ్ కుమార్‌ తనకు ప్రధాని కావాలనే కోరిక లేదని చెపుతున్నారు కానీ ఆయన కూడా రేసులో ఉన్నారని తన జెడీయు నేతల చేత చెప్పిస్తున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకోగానే ఆయన ఢిల్లీ వెళ్ళి బిజెపియేతర పార్టీల అధినేతలతో భేటీ అయ్యి కూటమి ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు దేశంలో ప్రతిపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దేశంలో వెనుకబడి ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇస్తాము. ఇదేమి పెద్ద విషయం కాదు,” అని అన్నారు.

కేసీఆర్‌, నితీశ్ కుమార్‌ ఇద్దరూ ప్రధాని కావాలనుకొంటున్నారు. కేసీఆర్‌ త్వరలో సొంత జాతీయ పార్టీ పెట్టుకోబోతున్నారు. నితీశ్ కుమార్‌ కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని కూటమిని ఏర్పాటు చేసుకొని దాని సాయంతో ప్రధాని కావాలనుకొంటున్నారు. కానీ కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడటం లేదు. కనుక వారిద్దరూ కలిసి పనిచేస్తారో లేదో తెలీదు.

ఒకవేళ కలిసి పనిచేసినా కాంగ్రెస్ పార్టీని కలుపుకొంటే ప్రధాని పదవి రాహుల్ గాంధీకే ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కోరుకొంటుంది తప్ప నితీశ్ కుమార్‌ లేదా కేసీఆర్‌ లేదా మరొకరికి ఇవ్వాలనుకోదు కదా?ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రాలేకపోతే ఆ తర్వాత ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది.

నితీశ్ కుమార్‌ కూటమిలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉంటారు. ఆమె కూడా ప్రధానమంత్రి కావాలని కలలు కంటున్నారు. ఇటీవల కోల్‌కతాలో మీడియాతో మాట్లాడుతూ,“ఆట ఇక్కడి నుంచే మొదలవుతుందని,” అన్నారు. అంటే కూటమికి తానే నాయకత్వం వహించి ప్రధానమంత్రి కావాలనుకొంటున్నట్లు దానర్దంగా కనిపిస్తోంది. ఇదే విషయం ఆమె తన తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ నేతల చేత కూడా చెప్పిస్తున్నారు. దేశ ప్రజలు మమతా బెనర్జీ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని, ఆమె తప్పక ప్రధానమంత్రి అవుతారని వారు అంటున్నారు. అంటే ఆమె కూడా ప్రధాని రేసులో ఉన్నారని స్పష్టం అవుతోంది. అయితే ఆమె ఇంకా దేశ ప్రజలకు ఇంకా ఎటువంటి హామీ ప్రకటించలేదు. బహుశః త్వరలో ఆమె కూడా ప్రకటించవచ్చు.

కేసీఆర్‌, నితీశ్ కుమార్‌ కలిసి పనిచేయగలరో లేదో తెలీదు. దానిలో కాంగ్రెస్ పార్టీని కలుపుకొంటారో లేదో తెలియదు. ఇప్పటికే ముగ్గురు ప్రధానమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. ఇంకా ఎంతమంది పోటీ పడతారో తెలీదు. అసలు కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారో తెలీదు. కానీ ప్రధాని రేసులో ఉన్నవారు ఎవరికి వారు జాతీయస్థాయి హామీలను అప్పుడే ప్రకటించేస్తున్నారు. ఇలా ఎవరికివారు హామీలు ప్రకటిస్తుంటే, వాటికి కూటమిలో మిగిలినవారు కట్టుబడి ఉంటారనే నమ్మకం లేదు. మరి ఏవిదంగా హామీలు ప్రకటిస్తున్నారో తెలీదు.

ప్రధాని పదవి, అధికారమే లక్ష్యంగా ఏర్పడబోతున్న కూటమి కప్పల తక్కెడగా మారుతుంది కనుకనే గతంలో ఇటువంటి ప్రయత్నాలు విఫలమయ్యాయి. బహుశః ఇప్పుడూ అదే జరుగవచ్చు. దేశంలో ప్రతిపక్షాలన్నీ ఐక్యం అయినా అవి కలిసి పనిచేయలేవు. వాటి ఈ బలహీనతే బిజెపికి శ్రీరామరక్ష!