KCR_Delhiతెలంగాణ సిఎం కేసీఆర్‌కి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉపఎన్నికల హడావుడి నెలకొన్నవేళ ఆయన రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండిపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సాధారణంగా సిఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళితే ఇక్కడ ఆయన సొంత పత్రికలో దాని గురించి ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లూ చాలా గొప్పగా అభివర్ణిస్తుంటుంది. రాష్ట్రంలో టిఆర్ఎస్‌ నేతలు కూడా సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఏదో గొప్ప అద్భుతం చేస్తున్నారనట్లు గొప్పలు చెప్పుకోవడం పరిపాటి. కానీ ఈసారి ఆ పత్రికలో కూడా ఆయన ఢిల్లీ పర్యటన విశేషాలు కనబడటం లేదు… టిఆర్ఎస్‌ నేతలందరూ కూడా తమ అధినేతనే మరిచిపోయినంతగా మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో తలమునకలైపోయారు.

రెండు రోజుల క్రితం సిఎం కేసీఆర్‌ యూపీ నుంచి ఢిల్లీ చేరుకొన్నప్పుడు ఆయన అక్కడ జాతీయ పార్టీ నాయకులతో, జాతీయ మీడియా ప్రతినిధులతో భేటీ అవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు రోజులలో ఎవరూ వచ్చి ఆయనను కలిసినట్లుగానీ లేదా ఆయనే వెళ్ళి ఎవరినీ కలిసినట్లుగానీ సమాచారం లేదు. ఢిల్లీలో నిర్మించుకొంటున్న పార్టీ కార్యాలయంలో తన ఛాంబర్ ఏ దిక్కున ఉండాలి… ఏ గది ఎటుండాలి… వంటి వాస్తు అంశాల గురించి బిల్డింగ్ కాంట్రాక్టర్‌కు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

సిఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్రమోడీని లక్ష్యంగా చేసుకొని చాలా తీవ్ర విమర్శలు చేశారు… నేటికీ ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ కూడా చేస్తూనే ఉన్నారు కనుక ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్ లభించడం కష్టమే. ఒకవేళ లభించినా ఆయన వెళ్ళి వారిని కలవడం చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది.

అయితే ఓ పక్క తన జాతీయ రాజకీయ ప్రవేశానికి ముందు తొలి అగ్నిపరీక్షగా నిలుస్తున్న మునుగోడు ఉపఎన్నికల హడావుడి రాష్ట్రంలో మొదలైతే వాటికి దూరంగా సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నారు? అనే ప్రశ్నకు కాంగ్రెస్‌, బిజెపి నేతలు సమాధానం చెపుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కొన్న తన కుమార్తె కల్వకుంట్ల కవితను ఏదో విదంగా ఆ కేసులో నుంచి బయటపడేసేందుకే ఆమెను వెంటబెట్టుకొని ఢిల్లీ వెళ్లారని చెప్పుతున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ‘ఈడీ, మోడీ అంటే భయపడేది లేదని’ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే సిఎం కేసీఆర్‌, ప్రస్తుతం ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారని అందుకే మునుగోడు ఉపఎన్నికలు ముంచుకు వస్తున్నా ఆయన ఢిల్లీలో ఉండిపోయారని కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. అయితే సిఎం కేసీఆర్‌ని వారు తక్కువగా అంచనా వేస్తున్నారేమో?ఆయన హైదరాబాద్‌ తిరిగిరాగానే ఢిల్లీలో ఏం చేశారనే విషయం మెల్లగా బయటకువస్తుంది.