Nawazuddin Siddiqui Sends Legal Notice to Filmfare for Defamatoryతెలంగాణా రాష్ట్ర సమితి పార్టీ పేరుతో ఓ రాజకీయ పార్టీని స్థాపించి, ప్రత్యేక తెలంగాణా సాధించిన వ్యక్తిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సాధననే హైలైట్ చేస్తూ… కేసీఆర్ జీవితచరిత్రను తెరకెక్కిస్తానని ప్రముఖ నిర్మాత మధుర శ్రీధర్ ఇప్పటికే ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ‘పెళ్లి చూపులు’ నిర్మాత రాజ్ కందుకూరితో కలిసి నిర్మించేందుకు బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను ఎవరు పోషిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

అయితే తాజా వర్గాల సమాచారం మేరకు కేసీఆర్ పోలికలు ఎక్కువగా కలిసిన బాలీవుడ్ హీరో నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు తెరపైకి వచ్చింది. సిద్ధిఖీ అయితే దాదాపుగా ఒరిజినల్ కేసీఆర్ మాదిరి చూపించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న చిత్ర యూనిట్, అభినయం విషయంలోనూ ఆయనైతే పూర్తి న్యాయం చేయగలరని భావిస్తున్నారట. ఇటీవల స్క్రిప్ట్ పనులు పూర్తి కావడంతో, ప్రస్తుతం కాస్టింగ్ పై చిత్ర నిర్మాతలు దృష్టి సారించగా, ముందుగా కేసీఆర్ పాత్రపై చర్చలు రాగా, సిద్దిఖీ పేరు హల్చల్ చేసినట్లు తెలుస్తోంది.

నిజానికి అంతకుముందు ఈ పాత్రకు బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావును తీసుకోనున్నట్టుగా వార్తలు వెలువడ్డాయి. అయితే నవాజుద్దీన్ సిద్ధిఖీ పేరు ఇటీవల కాలంలో బాగా పాపులర్ కావడం, కేసీఆర్ ముఖ కవళికలు తోడవ్వడంతో ఈయనతో సంప్రదింపులు జరిపే ప్రయత్నంలో ఉన్నట్లుగా సమాచారం. ఒక్కసారి ఫైనల్ కాగానే మధుర శ్రీధర్ అధికారికంగా ఈ ప్రకటన తెలియజేయనున్నారు. ఇతర తారాగణం వివరాలు, చిత్ర సాంకేతిక నిపుణుల ఎంపికలు కూడా త్వరలో ప్రకటించనున్నారు.