KCR BRS Partyకేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించినప్పటికీ ఆయన నత్తనడకలు చూస్తుంటే, ఆయన నిజంగానే జాతీయ రాజకీయాలలో రాణించాలనుకొంటున్నారా లేక దాని వెనుక వేరే ఏవైనా ఉద్దేశ్యాలు, వ్యూహాలు ఉన్నాయా?అనే సందేహం కలుగుతుంది.

కర్ణాటక ఎన్నికలలో జేడీఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తానని చెప్పిన కేసీఆర్‌, ఎన్నికల సమయంలో అటువైపు తొంగిచూడలేదు! ఏపీ బిఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ గుంటూరులో పార్టీ కార్యాలయం నిర్మించి ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తే రాలేదు! ఏపీలో బహిరంగసభ నిర్వహిస్తారని మీడియా లీకులు ఇచ్చినా ఇంతవరకు కేసీఆర్‌ ఏపీలో అడుగే పెట్టలేదు!

ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మించుకొన్నారు కానీ జాతీయస్థాయి రాజకీయాలు నెరపకపోవడంతో ఢిల్లీలో అది మరో క్యాంప్ కార్యాలయంగానే మిగిలిపోయింది. మహారాష్ట్రలో బిఆర్ఎస్‌ విస్తరణ కోసం సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఇంతవరకు ఇతర పార్టీల నేతలెవరూ బిఆర్ఎస్‌లో చేరలేదు. రైతు సంఘాల నేతలు, ద్వితీయస్థాయి రాజకీయ నిరుద్యోగులు మాత్రమే బిఆర్ఎస్‌లో చేరుతున్నారు.

ఇక మరోవైపు తెలంగాణ శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బిఆర్ఎస్‌ పార్టీని మళ్ళీ గెలిపించుకోవడానికి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలను ఆకట్టుకోవడానికి జూన్ 9న కొత్తగా మరో సంక్షేమ పధకాన్ని ప్రారంభిస్తుండటమే ఇందుకు నిదర్శనం. జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ రాణించలేకపోయినా ఏం కాదు కానీ తెలంగాణలో బిఆర్ఎస్‌ ఓడిపోతే అంతా తలక్రిందులైపోతుంది. కనుకనే కేసీఆర్‌ రాష్ట్ర రాజకీయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు భావించవచ్చు. మరైయితే జాతీయ రాజకీయాలంటూ ఎందుకు హడావుడి చేస్తున్నారంటే, రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.

1. తాను గట్టిగా ప్రయత్నిస్తే జాతీయస్థాయిలో చక్రం తిప్పి, లోక్‌సభ ఎన్నికలలో బిజెపి విజయావకాశాలను దెబ్బ తీసి మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలనని, కనుక తెలంగాణ జోలికి బిజెపి రావొద్దు… మీ జోలికి నేనూ రానని సూచించేందుకు కావచ్చు.

2. కేసీఆర్‌ ప్రధానమంత్రి కాబోతున్నారనే నమ్మకం, కనీసం ఆ ఆలోచన తెలంగాణ ప్రజలలో కలిగించగలిగితే, ఇక వారు కాంగ్రెస్‌, బిజెపిల వైపు చూడకుండా నిలువరించవచ్చని కావచ్చు.

కారణాలు ఏవైనప్పటికీ, కేసీఆర్‌ తెలంగాణలో బిఆర్ఎస్‌ పార్టీని పణంగా పెట్టి జాతీయ రాజకీయాలు చేస్తారనుకోవడం అవివేకమే. కనుక తెలంగాణలో బిఆర్ఎస్‌ కోసమే జాతీయ రాజకీయాలంటూ హడావుడి చేస్తున్నట్లు భావించవచ్చు.