KCR-Airplaneజాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సన్నాహాలు చేసుకొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఎల్లుండి విజయదశమినాడు (అక్టోబర్‌ 5వ తేదీన మధ్యాహ్నం 1.19 గంటలకు) జాతీయపార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటించబోతున్నారు. నిన్న హైదరాబాద్‌లో తన అధికార నివాసం ప్రగతి భవన్‌లో రాష్ట్రంలో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులతో సిఎం కేసీఆర్‌ సమావేశమయ్యి దాని గురించి క్లుప్తంగా చెప్పారు.

కేంద్ర ఎన్నికల కమీషన్‌, న్యాయ నిపుణుల సలహా మేరకు టిఆర్ఎస్‌ పార్టీనే జాతీయ పార్టీగా మార్చబోతున్నట్లు చెప్పారు. పార్టీ జెండా ఎప్పటిలాగే గులాబీ రంగులోనే ఉంటుందని కానీ మద్యలో టిఆర్ఎస్‌ పార్టీ చిహ్నామైన కారు బొమ్మకు బదులు భారతదేశం చిత్రపఠం ఉంటుందని తెలిపారు. అయితే జాతీయపార్టీకి కారు బొమ్మే ఎన్నికల చిహ్నంగా ఉంటుందని కేసీఆర్‌ తెలిపారు. నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నికలలో కొత్త జెండాతో జాతీయపార్టీగానే పోటీ చేయబోతున్నట్లు సిఎం కేసీఆర్‌ నిన్ననే ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్‌ 9న కలిసి వచ్చే పార్టీలతో కలిసి ఢిల్లీలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు కేసీఆర్‌ చెప్పారు.

కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించేముందు, ఆయనకు ఓ అగ్నిపరీక్ష ఎదుర్కొనున్నారు. మరోవిదంగా చెప్పాలంటే ఆయన తనకు తానే ఈ అగ్నిపరీక్ష పెట్టుకొన్నారని చెప్పవచ్చు. అదే… మునుగోడు ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ అభ్యర్ధిని భారీ మెజార్టీతో గెలిపించుకోవడం. ఈరోజే మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైంది.

ఈనెల 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరణ మొదలవుతుంది. అక్టోబర్‌ 14 వరకు నామినేషన్ల స్వీకరణ, నవంబర్‌ 17వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. నవంబర్‌ 3న పోలింగ్, నవంబర్‌ 6న ఫలితాలు వెలువడతాయి. కనుక కేసీఆర్‌ తన సొంత విమానంలో జాతీయ రాజకీయాలలో ల్యాండింగ్ అయ్యే ముందు ఈ ఉపఎన్నికలలో ఘన విజయం సాధించడం చాలా అవసరం లేకుంటే ఆదిలోనే హంసపాదు అన్నట్లవుతుంది.