KCR_ktr_cmతెలంగాణ సిఎం కేసీఆర్‌ తన మనసులో మాటను తన పార్టీ జిల్లాల అధ్యక్షుల ద్వారా చెప్పించేశారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో 33 జిల్లాల టిఆర్ఎస్‌ అధ్యక్షులు సమావేశమై సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని, ప్రధాని నరేంద్రమోడీ పాలనతో విసుగెత్తిపోయున్న దేశ ప్రజలు మీ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని ఆయనకు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లే ప్రధాన మంత్రిగా దేశాన్ని కూడా అభివృద్ధి చేసి చూపాలని దేశ ప్రజలు కోరుకొంటున్నారని కనుక మరిక ఆలస్యం చేయకుండా తక్షణం జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలని కోరారు. మీవెంట మేమందరం సైనికులులా నడుస్తామని చెప్పారు.

అనంతరం వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదే విషయం తెలియజేశారు. సిఎం కేసీఆర్‌ త్వరలో జాతీయ పార్టీ స్థాపించి జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించబోతున్నారని చెప్పారు.

వివిద జిల్లాలలో మంత్రులు కూడా విలేఖరులతో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. దేశవ్యాప్తంగా రైతులు, మేధావులు, ఆర్ధిక నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పలు ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్‌ను సంప్రదిస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం చారిత్రిక అవసరమని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ప్రధాని అయితే దేశం రూపురేఖలు సమూలంగా మారిపోతాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పధకాలు చూస్తున్న దేశప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

అక్టోబర్ 5వ తేదీ విజయదశమినాడు కొత్త సచివాలయాన్ని ప్రారంభించి సిఎం కేసీఆర్‌ తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసి, సచివాలయంలో కూర్చోబెట్టి ఆయన జాతీయ రాజకీయాలలో ప్రవేశించే అవకాశం ఉందని మిర్చి9తెలుగు.కామ్ చాలా కాలం క్రితమే ఊహించి చెప్పింది.

అయితే ఇప్పుడు తెలంగాణలో బిజెపి చాలా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు చాలా అసాధారణంగా ఉన్నందున, ఈ పరిస్థితులలో కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే, బిజెపి టిఆర్ఎస్‌లో అసంతృప్తి నేతలను ఎగద్రోసి ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రమాదం ఉంటుంది. కనుక ప్రస్తుతానికి ఆ ఆలోచన వాయిదా వేసుకోవచ్చు. ఒకవేళ మునుగోడు ఉపఎన్నికలలో బిజెపిని చావు దెబ్బ తీస్తే అప్పుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చేసే అవకాశం ఉంది.

సిఎం కేసీఆర్‌ విజయదశమినాడు వరంగల్‌ భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని పార్టీ పేరు, జెండా, అజెండా స్వయంగా ప్రకటిస్తారని ఇదివరకే ఓ మంత్రి చెప్పారు. ఇప్పుడు టిఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షులు, మంత్రులు కూడా అదే చెపుతున్నారు. కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం, జాతీయ రాజకీయ పార్టీని ప్రకటించడం రెంటికీ ముహూర్తం వేదిక ఖరారు అయినట్లే. అలాగే ప్రధాన మంత్రి కావాలనే తన మనసులో మాటని పార్టీ నేతలు, మంత్రుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పించేశారు కనుక ఇప్పుడు దేశంలో ఎన్ని పార్టీలు, ఎందరు బిజెపియేతర ముఖ్యమంత్రులు కేసీఆర్‌ నాయకత్వాన్ని, ప్రధానిగా అంగీకరిస్తారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.