నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో మునుగోడు ఉపఎన్నికలలో చెలరేగిపోవచ్చని ఉర్రూతలూగిన టిఆర్ఎస్ నేతలందరూ కేసీఆర్ ఆదేశం మేరకు మౌనం వహిస్తున్నారు. యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన ఇంత సంచలన వ్యవహారాన్ని మునుగోడు ఉపఎన్నికలలో వాడుకోవడం కంటే తన జాతీయరాజకీయాలలో ప్రవేశానికి వాడుకోవడం వలన త్వరగా గుర్తింపు పొందవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లున్నారు. ఈ వ్యవహారానికి సంబందించి పూర్తి సాక్ష్యాధారాలతో త్వరలోనే ఢిల్లీ వెళ్ళి అక్కడ కలిసి వచ్చే పార్టీల నేతలతో వీలైతే బహిరంగసభ లేదా ప్రెస్‌మీట్ పెట్టి, ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలను కూల్చివేయడానికి మోడీ ప్రభుత్వం ఏవిదంగా కుట్రలు పన్నుతోందో వివరించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వ్యవహారంతో కేసీఆర్ అపర చాణక్యుడని మరోసారి నిరూపించుకొన్న మాట వాస్తవం. అలాగే కేసీఆర్ కొట్టిన ఈ దెబ్బకి రాష్ట్ర బిజెపి నేతలకి, ముఖ్యంగా.. బండి సంజయ్‌కి దిమ్మ తిరిగిపోయిందనే మాట కూడా వాస్తవం. కనుక దీనిని మునుగోడు ఉపఎన్నికలలో ఉపయోగించుకొని ఉంటే టిఆర్ఎస్ తప్పకుండా లబ్దిపొంది ఉండేది. కానీ కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని భావిస్తున్న కేసీఆర్ దీంతో మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలనుకోవడమే అత్యాశగా కనిపిస్తోంది.
ఎందువలన అంటే, మోడీ ప్రభుత్వం పలు రాష్ట్రాలలో బిజెపియేతర ప్రభుత్వాలను దొడ్డిదారిలో కూల్చివేసి అధికారం చేజిక్కించుకొన్న సంగతి తెలిసిందే. ఆ వ్యవహారాలలో వచ్చిన అనేకానేక విమర్శలు, ఆరోపణలు, కోర్టు కేసులు, అప్రదిష్టనే మోడీ ప్రభుత్వం పట్టించుకోలేదు. మోడీ ప్రభుత్వంపై అవి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయి కూడా. ఒకవేళ చూపి ఉంటే తెలంగాణలో ఇటువంటి సాహసం చేసి ఉండేదే కాదు.
ఇక మరో విషయం ఏమిటంటే, ఈ వ్యవహారంలో బిజెపి, కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉందని కేసీఆర్ సాక్ష్యాధారాలు చూపి, వాటిని కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది. కానీ ఏకంగా ప్రభుత్వాలను కూల్చివేసినప్పుడే న్యాయస్థానాలు ఏమీ చేయలేకపోయాయి. నలుగురు ఎమ్మెల్యేలను ఎవరో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో మోడీ ప్రభుత్వాన్ని ఎవరేమి చేయగలరు? దీంతో మోడీ ప్రభుత్వానికి కొత్తగా మరో మరక అంటించవచ్చేమో కానీ దీంతో ఏ సమస్య ఉండకపోవచ్చు. అయినా ఇటువంటి సమస్యలను ఏవిదంగా ఎదుర్కోవాలో మోడీ, అమిత్ షాలకు బాగా తెలుసు.
ఇది కేసీఆర్‌కు, టిఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద వ్యవహారంగానే కనబడవచ్చు కానీ మోడీ ప్రభుత్వానికి మాత్రం కాదు! కనుక స్వయంగా సృష్టించుకొన్న లేదా బిజెపి అందించిన ఈ అవకాశాన్ని కేసీఆర్ అత్యాశకు పోయి చేజార్చుకొంటున్నారనే చెప్పవచ్చు. పైగా మోడీ, అమిత్ షాల జూలు పట్టుకొని లాగి రెచ్చగొట్టి చేజేతులా మరిన్ని కొత్త సమస్యలు తెచ్చిపెట్టుకొంటున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ, కేసీఆర్-మోడీ, అమిత్ షాల మద్య పోరాటాన్ని ఇది మరో లెవెల్‌కి తీసుకువెళ్లడం ఖాయమే.