KCR-Narendra-Modiతెలంగాణ సిఎం కేసీఆర్‌ కేంద్రంపై కత్తులు దూస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో బిజెపి క్రమంగా బలపడి టిఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయంగా మారడం ప్రధాన కారణమైతే, కేసీఆర్‌ ప్రధాని పదవి చేపట్టాలనుకోవడం మరో కారణంగా కనిపిస్తోంది. బిజెపిని అడ్డుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చుకొని జాతీయ రాజకీయాలలో చేరేందుకు సిద్దపడటం అందరూ చూస్తూనే ఉన్నారు.

మోడీని, బిజెపిని ఎంతగట్టిగా వ్యతిరేకిస్తే అంత తనకు దేశంలో మంచి గుర్తింపు, మద్దతు లభిస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు కనబడుతోంది. అది నిజం కూడా. అందుకే ఈ నెల 12న ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణలో పర్యటనను అడ్డుకొనేందుకు కేసీఆర్‌ చకచకా పావులు కదుపుతున్నారు.

అయితే తన చేతికి మట్టి అంటకుండా యూనివర్సిటీ విద్యార్ధి సంఘాలతో, కొత్త దోస్తులు వామపక్షాలతో ఆపని చేయిస్తున్నట్లు వారి ప్రకటనల ద్వారా అర్దం అవుతోంది. ఇంతకీ ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకోవడానికి వారు చెప్పే కారణం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందని!

కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలకు ఎటువంటి సమస్యలు, రాజకీయాలు ఉన్నప్పటికీ దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే సగౌరవంగా ఆహ్వానించి సాగనంపడం కనీస ధర్మం. ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్‌, ముఖ్యమంత్రి, డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు స్వాగతం, వీడ్కోలు చెప్పాలి. కానీ కేసీఆర్‌ ప్రోటోకాల్ పాటించడం ఎప్పుడో మానేశారు. మొక్కుబడిగా ఓ మంత్రిని పంపించి ఆ తంతు పూర్తిచేస్తున్నారు. పైగా ప్రధానిని అవమానించే విధంగా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారు.

దీంతో ప్రధాని మోడీని, బిజెపిని మరింత రెచ్చగొట్టినట్లే అవుతుంది. కనుక దీనికి ఏదో విదంగా తప్పకుండా ప్రతిచర్య ఉంటుందని వేరే చెప్పక్కరలేదు. అంతేకాదు… కేసీఆర్‌ తీరుతో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచన ఇప్పుడు కేంద్రానికి, బిజెపికి మరింత బలపడవచ్చు. ఒకవేళ మోడీ-అమిత్‌ షాలు దృష్టి పెట్టి పనిచేస్తే నష్టపోయేది టిఆర్ఎస్‌ పార్టీయే అని ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి చేదు అనుభవాలు చెపుతున్నాయి.

అదృష్టం కొద్దీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్‌ పైచేయి సాధించగలిగారు. ఒకవేళ ఆ డీల్ కుదిరి ఉంటే?అని ఆలోచిస్తే కేసీఆర్‌ రాజకీయంగా ఎంత ప్రమాదకర పరిస్థితులలో ఉన్నారో అర్దమవుతుంది. కేసీఆర్‌ ఒకసారి ట్రాప్ చేసి ముగ్గురిని పట్టుకొని నలుగురిని ఆపగలిగారు. కానీ ఎన్నిసార్లు ట్రాప్ చేయగలరు? ఎంతమందిని ఆపగలరు?

టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చడంపైనే టిఆర్ఎస్‌లో అసంతృప్తి నెలకొన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశిస్తే, రాష్ట్రంలో తమ తమ రాజకీయ భవిష్యత్‌ ఏమవుతుందనే ఆందోళన చాలా మందిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్‌ ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో టిఆర్ఎస్‌ను, అధికారాన్ని వదులుకోరని, దానిని కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారని వారికీ తెలుసు. ఆ నమ్మకంతోనే వారందరూ కేసీఆర్‌ నిర్ణయాలకి జేజేలు పలుకుతున్నారు. కానీ తమ రాజకీయ భవిష్యత్‌ ప్రమాదంలో పడవచ్చనే అనుమానం కలిగినప్పుడు తప్పకుండా కాంగ్రెస్‌, బిజెపిలలో దూకేసేందుకు వెనకాడరు.

ఈ విషయం బిజెపికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాగా తెలుసు. అందుకే సమయం కోసం ఎదురుచూస్తున్నాయి. కేసీఆర్‌ మోడీని గద్దె దించగలరో లేదో తెలీదు కానీ బిజెపి దాని వెనుకున్న కేంద్ర ప్రభుత్వాలకి కేసీఆర్‌ని గద్దె దించగల శక్తి ఉందనే భావించవచ్చు. కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలవైపు వేస్తున్న ప్రతీ అడుగు తెలంగాణకు, రాష్ట్రంలో అధికారానికి ఆయనని దూరం చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పవచ్చు.