KCR-TRSబిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి సిద్దం అవుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ ముందుగా మునుగోడు ఉపఎన్నికల అగ్నిపరీక్షలో తన సామర్ధ్యం నిరూపించుకోవలసి వస్తోంది. ప్రధాని కావాలని తహతహలాడుతున్న ఆయనకు ఓ ఉపఎన్నిక అగ్నిపరీక్ష కావడం చాలా విచిత్రమే కానీ ఇది స్వయంకృతాపరాదమే అని చెప్పక తప్పదు.

2014లో తొలిసారి ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్రలు జరగడంతో అప్రమత్తమైన కేసీఆర్‌ రాష్ట్రంలో మరో పార్టీ టిఆర్ఎస్‌కి, తన ప్రభుత్వానికి, తన అధికారానికి సవాలు చేసే స్థితిలో ఉండరాదనే ఉద్దేశ్యంతో టిడిపి, కాంగ్రెస్ పార్టీలలో నేతలను, ఎమ్మెల్యేలను తన పార్టీలోకి ఫిరాయింపజేసుకొని వాటిని చావు దెబ్బ తీశారు.

అయితే అక్కడితో ఆయన ఆగలేదు. ఆ తర్వాత తెలంగాణలో జరిగిన ప్రతీ చిన్నాపెద్ద ఎన్నికలలో కూడా టిఆర్ఎస్‌ మాత్రమే గెలవాలనుకొనేవారు. తన పార్టీ గెలవాలని కోరుకోవడం తప్పుకాదు. కానీ ప్రతీ ఎన్నికలలో నా పార్టీ మాత్రమే గెలవాలి అని కోరుకోవడమే తప్పు. అందుకోసం ఆయన ప్రతీ చిన్నాపెద్ద ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని వ్యూహరచనలు చేస్తూ టిఆర్ఎస్‌ను గెలిపించుకొనేవారు. ప్రతీ ఎన్నికను తన శక్తిసామర్ధ్యాలకు నిదర్శనంగా మార్చేసుకొన్నారు.

ఎవరైనా వరుస విజయాలు సాధిస్తున్నప్పుడు అందరూ వారికి జేజేలు పలకడం సహజమే. కానీ ఎల్లకాలం విజయాలు సాధించడం ఎవరికీ సాధ్యం కాదని అందరికీ తెలుసు. కనుక వరుస విజయాలు సాధిస్తూ నాకు తిరుగేలేదనుకొంటున్నప్పుడు, ఓ చిన్న అపజయం కూడా భూతద్దంలో నుంచి చూసినట్లు చాలా పెద్దదిగా కనిపిస్తుంటుంది. కేసీఆర్‌ విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది.

గత లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఆ తర్వాత హుజురాబాద్‌ ఉపఎన్నికలలో బిజెపి వరుస విజయాలు సాధిస్తూ కేసీఆర్‌కు వరుస షాకులు ఇచ్చింది. హుజురాబాద్‌ ఉపఎన్నికను కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వలననే ఆ ఓటమిని ఆయన ఓటమిగానే అందరూ పరిగణించారు తప్ప టిఆర్ఎస్‌ అభ్యర్ధి ఓటమిగా ఎవరూ భావించలేదు. దాంతో కేసీఆర్‌ అహం దెబ్బతింది. అందుకే మునుగోడు ఉపఎన్నికలకు మళ్ళీ సై అన్నారు. కనుక ఈ ఉపఎన్నికలో కూడా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు.

అంటే ఈ ఉపఎన్నికలో కూడా టిఆర్ఎస్‌ అభ్యర్ధి గెలిచినా ఓడినా ఆ క్రెడిట్ లేదా వైఫల్యం అది కేసీఆర్‌కే చెందుతుందని అర్దమవుతూనే ఉంది. జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్న ఆయనను ఈ ఉపఎన్నికలోనే ఓడించి రాజకీయంగా చావు దెబ్బతీయాలని బిజెపి కూడా చాలా పట్టుదలగా ఉంది. కనుక ఈ ఉపఎన్నికలో కేసీఆర్‌ (టిఆర్ఎస్‌) ఓడిపోతే, రాష్ట్రంలో ఓ ఉపఎన్నికలో పార్టీని గెలిపించుకోలేనివాడు జాతీయస్థాయిలో బిఆర్ఎస్‌ను ఏవిదంగా గెలిపించుకోగలడు?అనే సందేహం కలగక మానదు.

అంతేకాదు… ఈ ఉపఎన్నికలో టిఆర్ఎస్‌ ఓడిపోతే ఆ పార్టీలో నుంచి బిజెపిలోకి వలసలు మొదలవవచ్చు. బిజెపి కూడా టిఆర్ఎస్‌ నేతలను నయాన్నో భయన్నో పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం ఖాయం. అదే కనుక జరిగితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళడం చాలా కష్టంగా మారుతుంది. ఇదంతా కేసీఆర్‌ స్వయంకృతాపరాధమే అని చెప్పక తప్పదు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి ప్రతీ చిన్న ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా మార్చేయడం వలననే నేడు ప్రతీ ఎన్నిక కూడా ఆయనకు శక్తిసామర్ధ్యాలకు ఓ అగ్నిపరీక్షగా మారిపోయిందని చెప్పవచ్చు. అదే… రాష్ట్రంలో ప్రతిపక్షాలను బ్రతకనిచ్చి, ఎన్నికలను సాధారణ పరిస్థితులలో జరిగేలా చేసి ఉంటే, వాటిలో కొన్నిటిలో టిఆర్ఎస్‌ ఓడిపోయినా పెద్దగా నష్టం ఉండేది కాదు.

కానీ ప్రతీ ఎన్నికని ‘ఇజ్జత్ కా సవాల్’ గా మార్చేసుకోవడం వలననే కేసీఆర్‌కు, టిఆర్ఎస్‌ పార్టీకి ప్రతీ ఎన్నికలలో గెలవక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఓడిపోతే ఆ ఓటమి కేసీఆర్‌ ఓటమిగానే భూతద్దంలో చూసినట్లు పదిరెట్లు పెద్దదిగా కనబడుతూ టిఆర్ఎస్‌లో అందరినీ భయపెడుతోంది. దీనికి పరిష్కారం ఒక్కటే. ప్రజాస్వామ్య విధానాలకు పూర్తిగా కట్టుబడి ఉంటే చాలు!