KCR MIM GHMCE electionsపేరుకి మిత్రపక్షమైనా ఎంఐఎంను కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వదలకూడదని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఎలా అయినా, ఎవరి మద్దతూ లేకుండా గ్రేటర్ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ (150కి 75) దాటిపోవాలని చూస్తోంది. అందుకోసం ఎలక్షన్ నోటిఫికేషన్, ఎన్నికల కోడ్ కు ముందే పాతబస్తీ టార్గెట్ గా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇంతకుముందు కూడా పాతబస్తీలో రోజంతా గడిపిన కేటీఆర్ తాజాగా మంగళవారం కూడా ఓల్డ్ సిటీలో విస్తృతంగా పర్యటించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించిన కేటీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోల్‌ మోడల్‌గా పాలన కొనసాగిస్తుందన్నారు. కరెంటు కష్టాలను అధిగమించి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. పేదల దగ్గర ఒక్క పైసా కూడా తీసుకోకుండా 400 మందికి డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కట్టించామని, భవిష్యత్‌లో మరో 10 వేల ఇళ్లు నిర్మించి పేదలకు ఇస్తామన్నారు.

హైదరాబాద్ నగరంలో అన్ని మతాల ప్రజల కోసం స్మశానాలకు స్ధలాలు కేటాయిస్తామని చెప్పారు. మైనార్టీ పేద యువతుల పెళ్లి కోసం 51 వేలు ప్రభుత్వం ఇస్తోందన్నారు. 30 టీఎంసీల సామర్ధ్యంతో నగర ప్రజల దాహాన్ని తీర్చడానికి రిజర్వాయర్లు నిర్మిస్తోందని కేటీఆర్ చెప్పుకొచ్చారు.