kcr met with 26 states farmers union at pragathi bhavanతెలంగాణ సిఎం కేసీఆర్‌ కూటమి ప్రయత్నాలు విఫలమవడంతో సొంత పార్టీతో జాతీయ రాజకీయాలలోకి వెళ్ళాలనుకొన్నారు. అయితే దానికీ దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీల సహాయసహకారాలు చాలా అవసరం. కానీ మోడీని గద్దె దించడానికి బయలుదేరుతున్న కేసీఆర్‌తో చేతులు కలిపితే ఏమవుతుందో మహారాష్ట్ర, ఢిల్లీ, జార్ఖండ్ ప్రభుత్వాలను పరిస్థితి చూస్తే అర్దమవుతుంది. అలుపెరుగని పోరాటయోధురాలని పేరొందిన మమతా బెనర్జీ కూడా మోడీ-అమిత్‌ షాల ఒత్తిళ్ళను తట్టుకోలేక సరండర్ అయ్యి సైలెంట్ అయిపోయారు.

ఈ పరిస్థితులలో కేసీఆర్‌తో చేతులు కలిపేదెవరు? జాతీయ రాజకీయాలలో ప్రవేశించడం ఎలా?అంటే కేసీఆర్‌ ఇటు నుంచి కాకపోతే అటునుంచి నరుక్కు రావాల్సిందే అంటున్నారు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొన్నప్పుడే ఢిల్లీలో ఏడాదిపాటు ఆందోళన చేసిన తికాయత్ వంటి రైతు సంఘాల నేతలతో దోస్తీ చేశారు. ఆ ఆందోళన సమయంలో చనిపోయిన రైతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున సుమారు రూ.70 కోట్లు పంచిపెట్టారు. ఇది జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి పెట్టిన పెట్టుబడి అంటే టిఆర్ఎస్‌కు కోపం రావచ్చు కానీ ఇది వాస్తవం.

చాలా ముందుచూపున్న కేసీఆర్‌ ఆ విదంగా రైతు సంఘాలకు దగ్గరైన తర్వాత 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలను రైతు సమస్యలపై చర్చలు పేరిట హైదరాబాద్‌కు ఆహ్వానించి ముందుగా వారికి రాచమర్యాదలు చేసి, బస్సులు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి తెలంగాణలో మూడు రోజులు క్షేత్ర పర్యటనలు చేయించి వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, సంక్షేమ పధకాలు ఏవిదంగా అమలవుతున్నాయో కళ్ళారా చూసేలా చేశారు.

తర్వాత ప్రగతి భవన్‌లో డాక్యుమెంటరీ వీడియోలు కూడా చూపారు. వారు స్వయంగా కళ్ళతో చూసి చెవులతో విన్న తర్వాత కేసీఆర్‌ మాటలపై నమ్మకం ఏర్పడటం సహజం. ఆ తర్వాత ప్రగతి భవన్‌లో సిఎం కేసీఆర్‌ వారందరికీ కొసరికొసరి విందుభోజనాలు వడ్డించి వారితో కలిసి భోజనాలు చేశారు. తద్వారా వారికి మరింత దగ్గరయ్యారు.

ప్రగతి భవన్‌లో రెండురోజులపాటు జరిగిన ఈ చర్చా కార్యక్రమాలలో రైతులు ఏమి చెప్పారో తెలీదు కానీ కేసీఆర్‌ మాత్రం వారిని తన లక్ష్యం వైపు చాలా చక్కగా నడిపించారు. మీరందరూ ఎప్పటికీ రైతులుగానే మిగిలిపోకుండా రాజకీయాలలోకి ప్రవేశించాలని నొక్కి చెప్పారు. అప్పుడే రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పారు. తాను దశాబ్దంపాటు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని ఇంతగా అభివృద్ధి చేసుకొన్నప్పుడు మనం అందరం కలిసి పోరాడి రైతు వ్యతిరేక మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దె దించలేమని ప్రశ్నించారు.

కానీ సామాన్య రైతులు రాజకీయాలలోకి వచ్చి అత్యంత శక్తివంతులైన రాజకీయ పార్టీలను, నేతలను, వారికి అండగా నిలిచే పోలీసులను ఎదుర్కోలేరని కేసీఆర్‌కు కూడా తెలుసు. కనుక “మీరే మాకు నాయకత్వం వహించండి… మీ వెంట మేము నడుస్తాం…” అని వారు కోరారని సిఎం కేసీఆర్‌ స్వయంగా నిన్న పెద్దపల్లి జిల్లాలో జరిగిన బహిరంగసభలో చెప్పారు. కనుక మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించి రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ఆ వేదిక మీద నుంచి కేసీఆర్‌ మరోసారి శపధం చేశారు.

అంటే ఇటు నుంచి నరుక్కు రావడం సాధ్యం కాకపోతే అటునుంచి నరుక్కురావాలని కానీ నరకక తప్పదని కేసీఆర్‌ నిరూపిస్తున్నారు. ఈ నరుకుడు సాధ్యమా కాదా అనేది పక్కన పెడితే దేశంలో ప్రాంతీయ పార్టీలు తనతో చేతులు కలపలేని నిసహాయస్థితిలో ఉన్నారని గ్రహించిన కేసీఆర్‌ దేశంలో కోట్లాదిమంది రైతులను తన సైన్యంగా మలుచుకోవాలనుకోవడం ఆయన రాజనీతిజ్ఞతకు, ఆయన నాయకత్వ లక్షణాలకు మరో నిదర్శనంగా చెప్పవచ్చు.

Watch and subscribe for Exclusive Interviews: