kcr-meets-k-vishwanath2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క సినీ ప్రముఖుడికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ వారితో మంచి సంబంధాలు నేర్పినా కేసీఆర్ మాత్రం వారిని దూరం పెడుతూనే వచ్చారు. మహాకూటమి కొంత మంది సినీప్రముఖులకు టిక్కెట్లు ఇచ్చినా తెరాస మాత్రం వారికి దూరంగానే ఉంది. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఒక సినీ దర్శకుడిని కలిశారు.

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె.విశ్వనాథ్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్‌నగర్, సాయినగర్ రోడ్డు నంబర్ 10.. మార్గంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కె.విశ్వనాథ్ పేరు చెబితే చాలు.. ఆయన దర్శకత్వం వహించిన ఆణిముత్యాలు ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సిరిసిరిమువ్వ’ తదితర సినిమాలు గుర్తుకువస్తాయి.

తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెప లాడించిన ఘనత ఆయనదే. తన చిన్న నాటి నుండీ కేసీఆర్ ఆయనను ఎంతగానో అభిమానిస్తారని తెరాస వర్గాలు చెప్పాయి. స్వతాహా సాహిత్య ప్రియుడైన కేసీఆర్ ఆ గుబాళింపులు కె.విశ్వనాథ్ సినిమాలలో ఉండటంతో ఆయన అభిమానిగా మారిపోయారట. ఆయనకు ఆరోగ్యం బాలేదని ఎవరి ద్వారానో తెలుసుకుని కేసీఆర్ ఆయన వద్దకు వెళ్లారట.