Prakash Raj Becomes New Political Friend of KCRతెలంగాణ ముఖ్యమంత్రి రాజకీయాలలో గుణాత్మక మార్పు కోసం కాంగ్రెస్, బీజేపీలకు అతీతంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చెయ్యబోతున్నట్టు ప్రకటించి ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. గత నెలలో పశ్చిమ బెంగాల్ వెళ్లి మమతా బెనర్జీని కలుసుకున్న కేసీఆర్ ఇప్పుడు తాజాగా మాజీ ప్రధాని దేవే గౌడని కర్ణాటకలో కలిశారు.

అయితే జాతీయ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్ వెళ్లి కలిసిన ఇద్దరు నేతలు కాంగ్రెస్, బీజేపీ లేని ఫ్రంట్ ఏర్పాటుకు అంత నమ్మదగిన వారేమి కాదు. బెంగాల్ లో బీజేపీని అడ్డుకోవడానికి మమత కాంగ్రెస్ తో జతకట్టడం దాదాపుగా ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవలే ఆమె ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీని కలిసి ఆ విషయం చర్చించారు కూడా.

మరో వైపు వచ్చే కర్ణాటక ఎన్నికలలో జేడీఎస్ పాత్ర మూడవ స్థానానికే పరిమితం కాబోతుంది. ఇప్పటికే ఆ పార్టీ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు సమాచారం. ఒక వేళ హంగ్ వస్తే ఆ పార్టీ ఎవరికైనా మద్దత్తు ఇచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే కర్ణాటక ఎన్నికల ఫలితాల విడుదల తరువాత ఆ విషయం తేలిపోతుంది.

ఈ క్రమంలో దేవే గౌడను కలవడం కేసీఆర్ కు నష్టమే గానీ ఎలాంటి లాభము లేదు. మరి ఈ నేతలను ఏరి కోరి వారి ఇంటికి వెళ్లి మరీ కలవడంలో ఆయన ఉద్దేశమేంటో తెలియాల్సి ఉంది. జాతీయ రాజకీయాల పట్ల కేసీఆర్ కు సరైన ధృక్కోణం లోపించిందా అని అనిపించకమానదు.