KCR meeting in Huzurnagar assembly constituency cancelledసమ్మె చేస్తున్న తెలంగాణ ఆర్టీసీ కార్మికులతో చర్చలు ఈ నెల 18 లోగా చర్చలు మొదలు పెట్టాలని హై కోర్టు ఇప్పటికే ఆదేశించింది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ దశలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు హుజూర్ నగర్ లో ఒక ఎన్నికల బహిరంగసభలో పాల్గొనాల్సి ఉంది.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి సమ్మె గురించి ఏం మాట్లాడతారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు. అయితే కేసీఆర్‌ హుజూర్‌నగర్‌ పర్యటన రద్దయింది. గత రెండు గంటలుగా భారీ వర్షం కురుస్తుండటంతో పైలట్ల సూచన మేరకు హెలికాప్టర్‌లో వెళ్లేందుకు ఏవియేషన్‌ శాఖ అనుమతి ఇవ్వలేదు. సభ రద్దు కావడంతో కార్యకర్తలు నిరాశగా అక్కడి నుంచి వెనుదిరిగారు

మార్గమధ్యంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో అనుమతి నిరాకరించినట్లు ఏవియేషన్‌ డైరెక్టర్‌ భరత్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో హుజూర్‌నగర్‌ సభను రద్దు చేసినట్లు తెరాస ప్రకటించింది. హుజూర్ నగర్ ఉపఎన్నిక ఈ నెల 21న జరగబోతుంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా ఎన్నిక అవడంతో ఈ ఉప ఎన్నిక జరగబోతోంది.

ఆయన స్థానం నుండి తన భార్య పద్మావతి పేరును అభ్యర్దిగా ప్రకటించారు. గత ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన సైదిరెడ్డినే తెరాస తిరిగి అభ్యర్ధి గా ప్రకటించారు. గత ఎన్నికలలో ఆయన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతిలో సుమారు ఏడువేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే ఇక్కడ ట్రక్ గుర్తు అభ్యర్థికి గణనీయమైన ఓట్లు రావడంతోనే స్వల్ప తేడాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టెక్కారని ఈ సారి ఆ గుర్తు తొలగించడంతో తమ గెలుపు ఖాయమని అధికార పక్షం వాదన.