Roja Selvamani - KCRతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈరోజు కాంచీపురం, తిరుమల పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం 8.55కి ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట నుంచి కుటుంబ సమేతంగా బయల్దేరుతారు. 9.55 కి తిరుపతి చేరుకుంటారు. రెండు తెలుగు ముఖ్యమంత్రుల మధ్య ఉన్న మంచి సంబంధాల నేపథ్యంలో కొంతమంది మంత్రులు, స్థానికి ఎమ్మెల్యేలు కేసీఆర్ ను రిసీవ్ చేసుకుంటున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా కేసీఆర్ ను ప్రత్యేకంగా తన ఇంటికి ఆహ్వానించారని సమాచారం.

రోజా ఇంట్లో కేసీఆర్ అల్పాహార విందు స్వీకరిస్తారు. ఆ తరువాత తిరుపతి నుండి రోడ్డు మార్గంలో కంచికి వెళతారు. అక్కడ అత్తి వరదర్‌ స్వామీ వారిని దర్శించుకుని అనంతరం తిరుపతికి వస్తారు. ఒంటిగంటకు తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 3 గంటలకు తిరుపతి నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకుంటారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో స్థానిక పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు, పార్టీకి చెందిన కొంత మంది కీలక నేతలు ఉండనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు శనివారంతో ముగిసింది. సభ్యత్వ నమోదు గడువును 10వ తేదీ వరకు అధిష్ఠానం పొడిగించిన నేపథ్యంలో చివరి దశలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పోటీపడి పనిచేశారు. ఫలితంగా పది నుంచి 20 శాతం మేరకు సభ్యత్వం పెరిగిందని పార్టీ అధిష్ఠానం అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ఈ పర్యటన పెట్టుకున్నారని తెరాస వర్గాలు చెబుతున్నాయి.