KCR-Kavitha-Kalavakuntlaతెలంగాణలో తనకే తిరుగేలేదనుకొన్న కేసీఆర్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కూతురు కవిత చిక్కుకోవడం, తాజాగా టిఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రెండూ పెద్ద సమస్యలుగా మారాయి.

ప్రధాని నరేంద్రమోడీనే లక్ష్యంగా చేసుకొని కేసీఆర్‌ ఆయన మంత్రులు విమర్శలు చేస్తున్నందున ఈ లిక్కర్ స్కామ్‌లో నుంచి తన కుమార్తెను బయటపడేయమని కోరలేని పరిస్థితి కల్పించుకొన్నారు. కనుక రాజకీయ కక్షతోనే కేంద్ర ప్రభుత్వం తన కుమార్తెను ఈ కేసులో ఇరికించిందని బిఆర్ఎస్‌లో అందరూ వాదిస్తున్నారు. కానీ వారి వాదనలు, ఆక్రందనలతో ఈ కేసు నుంచి కల్వకుంట్ల కవిత విముక్తి కాలేరని వారికీ తెలుసు. కనుక ఆమెను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని కేసీఆర్‌తో సహా బిఆర్ఎస్‌లో అందరూ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ రాజకీయంగా ఎంత శక్తివంతుడైనప్పటికీ కూతురును కాపాడుకోలేక “అరెస్ట్ చేస్తే చేసుకోండి…” అని అనేశారు.

ఇక ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కాంగ్రెస్‌, బిజెపిలకు ఓ బలమైన ఆయుధంగా లభించడంతో దాంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై యుద్ధం ప్రారంభించి కేసీఆర్‌, టిఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ రాజీనామాలు చేయాలని, సిట్టింగ్ జడ్జ్ లేదా సీబీఐ దర్యాప్తు జరిపించాలని పట్టుబడుతున్నాయి.

ఏళ్ళ తరబడి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ, గ్రామాల నుంచి హైదరాబాద్‌కి కోచింగ్ కోసం వచ్చి లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన అభ్యర్ధులకు కేసీఆర్‌ ఏమని సమాధానం చెపుతారని బిజెపి ప్రశ్నిస్తోంది. పరీక్షలు రద్దయినందున నిరుద్యోగులు నిరాశనిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకోవద్దని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ విజ్ఞప్తి చేసి, పరోక్షంగా వారికి అటువంటి ఆలోచన కలిగేలా చేసిన్నట్లు అనిపిస్తోంది. కనుక బిఆర్ఎస్, బిజెపిల మద్య సాగుతున్న ఈ రాజకీయ ఆధిపత్యపోరు చాలా ప్రమాదకరమైన మలుపు తిరగబోతోందని అర్దం అవుతోంది. ఒకవేళ పరీక్షలు వ్రాసిన అభ్యర్ధులు, రాసేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్ధులు పరీక్షలు రద్దయినందున నిరాశనిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకొన్నా, ప్రతిపక్షాలతో కలిసి పోరాటాలు మొదలుపెట్టినా అప్పుడు కేసీఆర్‌ తప్పనిసరిగా రాజీనామా చేయడమో లేదా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ముందస్తు ఎన్నికలకి వెళ్ళవలసిరావచ్చు. తెలంగాణలో బిఆర్ఎస్‌కు అంతా సానుకూల వాతావరణం ఉందనుకొంటున్న సమయంలో హటాత్తుగా పరిస్థితులు ఈవిదంగా వ్యతిరేకంగా మారడం కేసీఆర్‌కు చాలా ఇబ్బందికరమే. కనుక కేసీఆర్‌ వీటిని ఏవిదంగా అధిగమిస్తారో చూడాలి.