KCR-Jaganఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తే ఇక్కడ సిఎం జగన్మోహన్ రెడ్డి, అక్కడ కేసీఆర్‌ ఇద్దరూ సమస్యలను కోరి తెచ్చుకొన్నట్లే అర్దం అవుతుంది. తెలంగాణ కోసం పోరాడి సాధించుకొన్న కేసీఆర్‌ ‘రాజ్యం వీరభోజ్యం’ అన్నట్లు తెలంగాణ రాష్ట్రం మీద సర్వాధికారాలు తనకే దఖలు పడ్డాయన్నట్లు వ్యవహరిస్తూ ప్రతిపక్షాలను నిర్ధాక్షిణ్యంగా అణచివేశారు. ‘ఆపరేషన్ సక్సస్ బట్ పేషెంట్ ఈజ్ డెడ్’ అన్నట్లు కాంగ్రెస్‌, టిడిపిలను దాదాపు నిర్వీర్యం చేసి తనకు తిరుగేలేదనుకొంటే వాటి స్థానంలోకి బిజెపి దాని వెనుకే కేంద్ర ప్రభుత్వం ప్రవేశించాయి. కేసీఆర్‌ ఇప్పుడు వాటితో ఏవిదంగా పోరాడవలసివస్తోందో అందరూ చూస్తూనే ఉన్నారు.

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండొద్దు… ప్రజాస్వామ్యం అంటే టిఆర్ఎస్‌ అధికారంలో ఉండటమే. తెలంగాణ అంటే టిఆర్ఎస్‌ పార్టీయే. టిఆర్ఎస్‌ అంటే కేసీఆర్‌ అన్నట్లుగా మార్చేశారు కేసీఆర్‌. ఆయన రాజకీయ నిరంకుశత్వంతో తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు కనుక పట్టించుకోవడం లేదు కానీ ప్రతిపక్షాల మనుగడ ప్రమాదంలో పడింది కనుక అవి గట్టిగా పోరాడుతున్నాయి. తత్ఫలితంగా తెలంగాణ ఉద్యమాల సమయంలో ఒక్క గొంతుగా నినదించిన ప్రజలు ఇప్పుడు టిఆర్ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ పార్టీల మద్య చీలిపోయారు.

తెలంగాణలో ఇంతగా అభివృద్ధి జరుగుతున్నా, సంక్షేమ పధకాలు అమలవుతున్నా కేవలం 8 ఏళ్లలోనే ఇన్ని పార్టీలు ఎందుకు పుట్టుకువచ్చాయి? కేసీఆర్‌ పట్ల ఇంత వ్యతిరేకత ఎందుకు ఏర్పడింది?అని ఆలోచిస్తే ఆయన ప్రజాస్వామ్య విధానాలకి, సామాన్య ప్రజలకి దూరం కావడం వలననే అని చెప్పక తప్పదు.

నా మాటే శాసనం అన్నట్లు పాలన సాగిస్తున్న కేసీఆర్‌ ఇప్పుడు పార్టీ నేతల, ప్రజల అభిమతాన్ని పట్టించుకోకుండా టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్‌గా మార్చేసి అందరికీ మరింత దూరం అవుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్‌ అపర చాణక్యుడు, మహా మేధావి, ఆయన వ్యూహాలకు, ఎత్తులకు తిరుగులేదని మీడియా గట్టిగా చెపుతుండటంతో కేసీఆర్‌ కూడా దానికే ఫిక్స్ అయిపోయి ఇప్పుడు బిఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పేందుకు బయలుదేరుతున్నారు. ఈ ప్రయత్నంలో కూడా ఆయన విజయం సాధిస్తారో లేదో తెలీదు కానీ ఆయన నిర్ణయాలు, విధానాలతో తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా టిఆర్ఎస్‌ పార్టీకి ఎంతో కొంత నష్టం జరిగే అవకాశాలు మాత్రం ఉన్నాయని చెప్పవచ్చు. ఇవన్నీ ఆయన స్వయంకృతమే కనుక ఫలితం ఎలా ఉన్నా కేసీఆర్‌ అంగీకరించక తప్పదు.

ఇక ఏపీలో తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సిఎం జగన్మోహన్ రెడ్డి మొట్ట మొదట చేయాల్సిన పని రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని గాడినపెట్టడం, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయిన ఆంధ్రప్రదేశ్‌కి అమరావతిని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడం, రాష్ట్రానికి పరిశ్రమలు, జాతీయ అంతర్జాతీయ సంస్థలు, పెట్టుబడులు వచ్చేలా చేసి భారీగా ఉద్యోగకల్పన చేయడం. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేసి వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేయడం. గత ప్రభుత్వ నిర్ణయాలను యదాటడంగా అమలుచేసి ఉంటే జగన్ విశ్వసనీయత, ఆంధ్రప్రదేశ్‌ పట్ల పారిశ్రామిక వేత్తలకు గట్టి నమ్మకం కలిగి ఉండేది. అప్పుడు రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెంది ఉండేది.

కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పక్కన పడేసి ఈ మూడున్నరేళ్ళలో ఎడాపెడా అప్పులు చేస్తూ సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలను రప్పించలేకపోవడం నేటికీ యువత హైదరాబాద్‌, బెంగళూరు నగరాలకు వలసలు పోవలసివస్తోంది.

తెలంగాణలో కేసీఆర్‌ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేసి బిజెపిని కోరితెచ్చుకొన్నట్లుగానే ఏపీలో జగన్ టిడిపిని నిర్వీర్యం చేసి బిజెపికి మార్గం సుగమం చేస్తున్నారు. ఒకప్పుడు కేసీఆర్‌ కూడా కేంద్రంతో సక్యతగానే ఉండేవారు. కానీ ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు. తెలంగాణ తర్వాత బిజెపి ఏపీపైనే దృష్టి పెడుతుంది కనుక ఏదో ఓ రోజు జగన్ కూడా కేంద్రంతో యుద్ధం చేయక తప్పదు.

అదే… సిఎం జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం మొదలుపెట్టిన అమరావతి నిర్మాణపనులను పూర్తిచేసి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేసి ఉండి ఉంటే, నేడు టిడిపి ఇంతగా బలపడి ఉండగలిగేది కాదు. ప్రజలు కూడా మళ్ళీ వైసీపీకే పట్టం కట్టి ఉండేవారు. కానీ అంతా స్వయంకృతమే కనుక వచ్చే ఎన్నికల గురించి ఆందోళన తప్పడం లేదు.