ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరుగులేని అధికారం చలాయిస్తున్నారు. వారికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు వీరవిధేయంగా మెసులుకొంటున్నారు. రెండు అధికార పార్టీలకు బలమైన క్యాడర్ ఉంది. కనుక రెండు రాష్ట్రాలలో అధికార పార్టీలు చాలా బలంగా ఉన్నాయి.
ముఖ్యమంత్రుల విషయానికి వస్తే, తెలంగాణ సిఎం కేసీఆర్ చాలా మాటకారి. తన రాజకీయ వ్యూహాలతో విమర్శకులనుకూడా మెప్పిస్తుంటారు. అయితే ‘నాకన్నీ తెలుసు’ అనే అహంభావం, ‘నేను మహా మేధావిని’ అనే గట్టి నమ్మకం, ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు అంటే చులకనభావం, నిరంకుశ ధోరణి ఆయనలో స్పష్టంగా కనబడుతుంటాయి.
వీటికి కొన్ని ఉదాహరణలుగా యాదాద్రి ఆలయంలో తన బొమ్మ చెక్కించుకోవడం, పాత రాజ్యాంగం పనికిరాదని కొత్త రాజ్యాంగం వ్రాయాలని చెప్పడం, తాను డాక్టర్ అంబేడ్కర్‌తో సమానమన్నట్లు దళిత బంధు ఫోటోలలో చూపుకోవడం, సచివాలయానికి వెళ్ళకుండా తన ఇంటికే (ప్రగతి భవన్) మంత్రులు, అధికారులను రప్పించుకొని సమావేశాలు నిర్వహిస్తుండటం, ఇంతవరకు దేశాన్ని పాలించినవారెవరికీ ఆ సామర్ధ్యం లేదని తాను మాత్రమే దేశాన్ని గాడిలో పెట్టగలనని అనుకోవడం వంటివి చెప్పుకోవచ్చు.
అయితే ప్రజలకు కావలసింది అభివృద్ధి, సంక్షేమం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాత్రమే. వాటిని సిఎం కేసీఆర్ సమర్ధంగా అందిస్తున్నారు కనుక ఆయన రాజకీయాలను సామాన్య ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పవచ్చు.
కానీ ఆయనలోని ఈ అవలక్షణాలే రాష్ట్రంలో ప్రతిపక్షాలు మళ్ళీ బలపడేందుకు దోహదపడ్డాయని చెప్పవచ్చు. కేవలం ఏడేళ్ళలోనే సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపగా, కేవలం ఏడేళ్ళలోనే రాష్ట్రంలో మళ్ళీ ప్రతిపక్షాలు మళ్ళీ బలపడటమే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ స్థానంలో బిజెపి బలపడి ఇప్పుడు ఆయనకు పక్కలో బల్లెంలా మారింది. ఇందుకు దాని సమర్దత కంటే కేసీఆర్ నిరంకుశ అప్రజాస్వామిక వైఖరే కారణమని చెప్పవచ్చు!
ఇక సిఎం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయనకు కేసీఆర్ అంత వాక్చాతుర్యం లేదు. కేసీఆర్‌లా అహంభావం ప్రదర్శించరు కూడా. కానీ రాష్ట్రంలో ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం ద్వారా పార్టీకి ఎదురులేకుండా చేసుకోవాలనే కేసీఆర్ వ్యూహాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకన్నా జగన్ రెండాకులు ఎక్కువే చదివారని చెప్పుకోవచ్చు.
అయితే చంద్రబాబు ప్రభుత్వం చేయలేనిదేదో ఆయన చేసి చూపుతారనుకొని ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం కట్టబెడితే తొలిరోజు నుంచి నేటి వరకు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుండటం, రాజకీయ కారణాలతోనే మూడు రాజధానుల ప్రతిపాదన, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం సంక్షేమ పధకాలు అమలుచేస్తుండటం, వాటి కోసం విచ్చలవిడిగా అప్పులు చేస్తుండటం ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తున్నాయి.
నిజానికి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి రావడం చాలా కష్టం. అటువంటి గొప్ప అవకాశం వచ్చినప్పుడు, దానిని సద్వినియోగం చేసుకొని, అమరావతి నిర్మాణపనులను వేగవంతం చేసి, కేసీఆర్‌లాగ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపి ఉండి ఉంటే, ఏపీ ప్రజలు కూడా బహుశః టిడిపి, జనసేనలని పట్టించుకొనేవారు కారేమో?కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల అభిప్రాయాలకు, ఆకాంక్షలను పట్టించుకోకుండా కేవలం రాజకీయాలు చేస్తుండటం వలననే నేడు టిడిపి, జనసేనలు మళ్ళీ నిలద్రొక్కుకొని వైసీపీని సవాలుచేయగలుగుతున్నాయని చెప్పవచ్చు.
అంటే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ పూర్తి భిన్నమైన పరిపాలన సాగిస్తున్నప్పటికీ, వారి రాజకీయ అవలక్షణాలే వారి రాజకీయ శత్రువులు బలపడేందుకు దోహదపడుతున్నాయని స్పష్టం అవుతోంది. స్వయంకృతాపరాధాలకు ఎవరైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. కనుక కేసీఆర్, జగన్ ఇందుకు మినహాయింపు కాకపోవచ్చు.