KCR - Jaganరెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాకపోతే రాష్ట్ర రాజకీయాలు హస్తిన కేంద్రంగా మారిపోయాయి. ఢిల్లీ పర్యటన అనంతరం ఏపీ సీఎం జగన్ తన విమర్శల వేగానికి పదును పెట్టి ప్రతిపక్షాలలో రాజకీయ వేడి రాజేశారు. రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజ కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఏకంగా హస్తినలోనే పోరాటానికి దిగారు.

రాష్ట్ర రైతాంగానికి అన్యాయం జరిగితే కేంద్రంతో అయినా పోరాటానికి సిద్ధం అంటూ కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు భరోసాగా నిలబడ్డారు.రాష్ట్ర ప్రజల సంక్షేమం పేరుతో దేశ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న బీజేపీ పార్టీతో కూడా వైరానికి సిద్ధమయ్యారు కేసీఆర్. కేంద్రానికి ఉన్న మెజారిటీని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాలకే తమ తొలి ప్రాధాన్యత అంటూ బీజేపీతో ‘పోరాటానికి’ సిద్ధమయ్యారు కేసీఆర్.

తెలంగాణాలో పరిస్థితి అలా ఉంటే.., ఏపీలో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం నెలకొంది. గత ఎన్నికలలో వైసీపీకి ప్రభుత్వాన్ని స్థాపించే అధికారం ప్రజలు అందిస్తే, కేంద్రం మెడలు వంచి చంద్రబాబు సాధించలేని “ప్రత్యేక హోదా” నేను సాధించి చూపిస్తా అంటూ జగన్ ప్రజలకు వాగ్దానం చేశారు. అయితే జగన్ కోరుకున్నది ప్రజలు అందించారు కానీ, ప్రజలు ఆశించింది మాత్రం జగన్ సాధించలేకపోయారు.

‘కేంద్రం మెడలు వంచడం’ మాట అటుంచితే కేంద్రం ముందు ‘నోరె’త్తలేని పరిస్థితిలో జగన్ నిలిచారని ప్రతిపక్షాలు అన్న విమర్శలను కూడా తిప్పికొట్టలేని పరిస్థితి వైసీపీది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మెజారిటీ అందించడంతో కేంద్రానికి మన ఎంపీలతో అవసరం లేకుండా పోయిందని తాను రాష్ట్ర హక్కుల కోసం కేంద్రంతో “పాకులాడం” తప్ప మరేం చేయాలంటూ ఏపీ సీఎం జగన్ చేతులెత్తేశారు. అప్పటినుండి ఇప్పటివరకు ఈ పరిస్థితిలో మార్పు లేదు.

ఒక్క ప్రత్యేక హోదా విషయమే కాదు, విశాఖ రైల్వే జోన్., “విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఎందరో ప్రాణ త్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ., ఆంధ్రుల చిరకాల స్వప్నం పోలవరం నిర్మాణం., రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు., నదీ జలాల సమస్యలు., రాజధాని నిర్మాణ వ్యయం ఇలా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రజలు తమ హక్కుగా పొందాల్సిన మరెన్నో అంశాలలో నోరెత్తలేని దుస్థితి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానిది.

నాటి టీడీపీ హయాంలో చంద్రబాబు “ధర్మ పోరాట దీక్షలు” అంటూ కేంద్రం మీద ప్రకటించిన యుద్ధం ఫలితమే అప్పటి టీడీపీ ఎన్నికల ఫలితాలు అంటూ రాష్ట్ర రాజకీయాలలో బహిరంగ చర్చే జరిగింది. నాటి ‘ధర్మ పోరాటాల’ ఫలితమే రాష్ట్రంలో నేటి ‘అధర్మ పాలన’ అంటూ రాష్ట్రంలో మెజారిటీ వర్గ ప్రజల అభిప్రాయం. కేంద్రం మెడలు వంచుతా అన్న సీఎం జగన్ తన ఆర్ధిక విధానాలతో రాష్ట్ర ప్రజలు నడ్డి విరుస్తున్నారని విపక్షాలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు.

రాష్ట్ర హక్కులు సాధిస్తా అన్న జగన్ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు రాజ్యసభ, లోక్ సభలలో తమ పార్టీ తరపున పూర్తి మద్దతు పలుకుతూ కేంద్ర ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తుతూ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను కేంద్రంపై పోరాడమని ఉచిత సలహాలు ఇస్తుంటారని ఎర్రజెండా పార్టీలు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షాలు పోరాడితే మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారా? అంటున్నాయి విపక్షాలు.

జగన్ తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడడానికి కేంద్రం వద్ద 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని వంచి, కేంద్ర ప్రభుత్వానికి పరోక్ష మద్దతు తెలుపుతూ ప్రాధేయపడడమో.., ప్రాకులాడడమో తప్ప పోరాటాలు చేయలేమంటూ రాష్ట్రాన్ని ‘ఫ్యాన్ గాలి’కి వదిలేశారు. అయితే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఎవరైనా తలలు వంచాల్సిందేనంటూ, ఉద్వేగభరితమైన స్పీచ్ లను ఇస్తూ కేంద్రంతో పోరాటాలకు సిద్దమయ్యారు తెలంగాణా సీఎం కేసీఆర్.

ప్రజల కోసం చేసినా, తన రాజకీయ వైరంతో చేసినా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడంలో కేసీఆర్ తన దూకుడుని ప్రదర్శిస్తుండగా, ప్రజాపక్షం అనే మాటకు తావు లేకుండా కేవలం తన రాజకీయ ప్రస్థానానికే ప్రాధాన్యత ఇస్తూ కేంద్రంతో అచ్ఛికబుచ్చికలాడడం జగన్ వంతవుతోంది. అంతిమంగా… ఈ పోరాటాలతో.., పాకులాటలతో వచ్చే ఎన్నికలలో ప్రజల మనసులను., కేంద్ర ప్రభుత్వ మద్దతుని గెలిచేదెవరో, ఓడేదెవరో కాలమే నిర్ణయించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.