Jagan_KCRబిఆర్ఎస్‌ పార్టీతో జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఈరోజు ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. ఈ సభకి ఢిల్లీ, పంజాబ్, కేరళ, ముఖ్యమంత్రులతో పాటు వివిద రాష్ట్రాలకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులని ఆహ్వానించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే తొలుత బిఆర్ఎస్‌ పార్టీని విస్తరించడానికి సిద్దం అవుతున్న కేసీఆర్‌, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించలేదు. కారణం అందరికీ తెలుసు.

వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, అప్పులతో కొనసాగుతోంది. ఇంకా కేసుల బెడద ఉందనే ఉంది. కనుక కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌తో సిఎం జగన్‌ ప్రత్యక్షంగా చేతులు కలపలేరు. అందుకే కేసీఆర్‌ పిలవలేదు… జగన్‌ హాజరు కాలేదనుకోవచ్చు. అయితే బిఆర్ఎస్‌ పార్టీ ఏపీలో తమ పార్టీకి, ప్రభుత్వానికి సవాలు విసరబోతోంది కనుక అది తమ రాజకీయ శత్రువని వైసీపీ నేతలు సమర్ధించుకోవచ్చు. అది వేరే విషయం కానీ దేశాన్ని ఉద్దరించదానికి బయలుదేరుతున్న కేసీఆర్‌, పక్కనే ఉన్న తెలుగు రాష్ట్రాన్ని కలుపుకొని ముందుకు సాగకపోయినా తొలుత ఏపీతోనే రాజకీయాలు చేయబోతుండటం విడ్డూరమే కదా?

ఈరోజు ఖమ్మంలో జరుగబోయే బహిరంగసభతో అధికార వైసీపీకి సంబందం లేదన్నట్లు దూరంగా ఉంటున్నా, ఏపీ నుంచి వందలాది ఆర్టీసీ బస్సులని బిఆర్ఎస్‌ పార్టీకి ఎందుకు కేటాయించారో చెప్పాలని మాజీ మంత్రి కెఎస్ జవహార్ ప్రశ్నించారు. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు రెండు తెలుగు రాష్ట్రాల మద్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలని పరిష్కరించుకోకపోయినా ఇటువంటి సందర్భాలలో పరస్పరం బాగానే సహకరించుకొంటారని కెఎస్ జవహార్ అన్నారు.

గత ఎన్నికలలో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడిన కేసీఆర్‌కి సిఎం జగన్‌ ఇప్పుడు ఈవిదంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారని కెఎస్ జవహార్ అన్నారు. రాబోయే ఎన్నికలలో కూడా బిఆర్ఎస్‌, వైసీపీలు సహకరించుకోవడం ఖాయమని కెఎస్ జవహార్ అన్నారు. అయితే ఇరువురు ముఖ్యమంత్రులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే ఎన్నికలలో టిడిపి గెలుపుని అడ్డుకోవడం వారితరం కాదన్నారు.