KCR speaks about peace with APపోలవరం ముంపు ప్రాంతంలో భాగంగా ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణ పరిధిలోకి రానున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తర్వాత అలాంటిదేమీ లేదని స్వయంగా చంద్రబాబు స్పందించి ఆ వివాదానికి తెరదించారు. అయితే కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే రాజకీయంగా చంద్రబాబు తీవ్ర ఒత్తిడికి గురైన మాట వాస్తవం. కానీ చంద్రబాబు స్పష్టీకరణతో ఈ వివాదానికి శుభం కార్డు పడింది అంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది.

కానీ, ‘శ్రీరామనవమి’ సందర్భంగా భద్రాచలం శ్రీరామ కల్యాణానికి విచ్చేసిన కేసీఆర్, “పోలవరం ముంపు ప్రాంతంలో భాగంగా ఉన్న ఐదు గ్రామాల విషయం ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, గ్రామాలను తిరిగి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని” స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో వివాదం మళ్ళీ రాజుకున్నట్లయ్యింది. మరి దీనికి పరిష్కారం ఏ విధంగా లభిస్తుందో గానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనిని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో అన్న చర్చలు మొదలయ్యాయి.

రాష్ట్ర విభజన వేళ, భద్రాచలానికి సమీపంలో ఉండి, పోలవరం ముంపులో కలిసిపోనున్న గ్రామాలను ఏపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో పాలన పడకేయగా, గురువారం నాడు చంద్రబాబు పర్యటించి, అక్కడి ప్రజల్లో భయాలను తొలగించే పని చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ మరోసారి ముంపు గ్రామాలు తెలంగాణకు రానున్నాయని వ్యాఖ్యానించడం విశేషం.