KCR Invites YS Jagan for Kaleswaram Project Launchతెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఈరోజు ఉదయం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఆహ్వాన పత్రికను దుర్గమ్మ పాదాల చెంత ఉంచి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయానికి వచ్చిన కేసీఆర్‌ను ముఖ్యమంత్రి సాదరంగా ఆ‍హ్వానించి, దగ్గరుండి లోనికి తీసుకు వెళ్లారు.

కేసీఆర్‌ ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలంటూ జగన్‌ను ఆహ్వానించారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి రావాలని కేసీఆర్‌ ఆహ్వాన పత్రిక అందచేశారు. అనంతరం కేసీఆర్ ఆయన వెంట వచ్చిన ఇతర నాయకులకు జగన్ విందు ఏర్పాటు చేశారు. కేసీఆర్, జగన్ పక్కపక్కనే కూర్చుని విందు ఆరగించారు. జగన్ ప్రమాణస్వీకారం చేసి ఇరవై రోజులు కూడా కాకముందే రెండో సారి ఆయన కేసీఆర్ కు విందు ఏర్పాటు చేసినట్టు అయ్యింది.

ప్రమాణస్వీకారానికి కేటీఆర్ రాలేదు. దీనితో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టారు. సాయంత్రం కేసీఆర్ విజయవాడలోని శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి బయల్దేరుతారు. అక్కడ విశాఖ శ్రీ శారదాపీఠ ఉత్తరాధికారి శిష్య తురియాశ్రమ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. ఆ కార్యక్రమం పూర్తి అయ్యాక విజయవాడ విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ చేరుకుంటారు.