KCR-YS Jagan - Pawan Kalyanతనకు ఎవరితోనూ పొత్తులు అవసరం లేదని, తాను దేవుడిని ప్రజల్ని మాత్రమే నమ్ముకున్నా అని ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తరచూ చెబుతూ ఉంటారు. అయితే ఇది వట్టి మాటలు అన్నట్టుగా తేల్చి పారేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన పార్టీతో పొత్తు కోసం వైసీపీ నేతలు యత్నిస్తున్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. జనసేనకు బలం లేదంటూనే రాయబారాలు నడిపిస్తున్నారని పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తల సమావేశంలో విమర్శించారు.

అంతటితో ఆగకుండా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నేతలతో జనసేన పార్టీతో మాట్లాడిస్తున్నారని పవన్‌ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనితో వైఎస్సాఆర్ కాంగ్రెస్ తరపున తెరాస ఇప్పటికే రంగంలోకి దిగిందని తెలుస్తూ ఉంది. బహుశా చంద్రబాబు కు తెలంగాణ ఎన్నికలలో చేసిన రచ్చకు కేసీఆర్ ఇస్తాను అని చెప్పిన రిటర్న్ గిఫ్ట్ ఇదే కావొచ్చు. జనసేనతో పొత్తును వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు బహుమతిగా ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నట్టుగా పవన్ చెప్పిన మాటలు బట్టి అర్ధం అవుతుంది.

ఇప్పటికే జగన్, తెరాస మధ్య సంబంధాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలతో అది తేటతెల్లం అయ్యింది. మొన్న ఆ మధ్య వైఎస్సాఆర్ కాంగ్రెస్ మాజీ ఎంపీ వరప్రసాద్.. జనసేతో పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో చంద్రబాబును ఒంటరిగా ఎదురు కోవడం కష్టమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చారా అనే అనుమానం కలుగకమానదు. పైకి మాత్రం సింహం సింగల్ గా వస్తుంది వంటి డైలాగులు వాడుతున్నారు.

దీనిపై మరింత స్పష్టత రావాలంటే వైకాపా తెరాస నాయకులలో ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించాల్సి ఉంది. మరోవైపు పవన్ కళ్యాణ్ తనను సంప్రదించిన నేతల పేర్లు బయట పెట్టకపోవడంతో ఇది వైకాపాపై పవన్ కళ్యాణ్ సంధించిన మైండ్ గేమ్ అని కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి వ్యాఖ్యలతో జనసేన కీలకమైన శక్తిగా చూపించుకుని శ్రేణులను ఉత్తేజితం చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానం ఉంది కొందరికి.