kcr inaugurated kaleshwaram projectతెలంగాణ కల సాకారమైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతికి అంకితం చేశారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర సీఎంలు వైఎస్‌ జగన్‌, ఫడణవీస్‌, పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. మొదట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన శిలాఫలకాన్ని స్విచ్‌ ఆన్ చేసి ఆవిష్కరించారు.

సరిగ్గా 11:23 నిమిషాలకు ఈ శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇద్దరూ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఈ అవకాశం కల్పించడం విశేషమని చెప్పుకోవచ్చు. అనంతరం ప్రాజెక్ట్ దగ్గర మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ కొబ్బరికాయలు కొట్టారు. చివరన కేసీఆర్ గుమ్మడికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు.

మేడిగడ్డ ఆనకట్టను ప్రారంభించిన అనంతరం కన్నేపల్లి పంప్‌హౌస్‌ వద్ద పూజలు చేశారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేసీఆర్ జాతికి అంకితం చేశారు. మూడు బ్యారేజీలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెళ్లు, 20 లిఫ్ట్‌లు, 19 పంపు హౌస్‌లు, మొత్తం 147 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్దదైన నీటిపారుదల ఎత్తిపోతల పథకం. 80,500 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకూ 50,000 కోట్లు ఖర్చుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం.