KCR-Hyderabad-High-Courtహైకోర్టు చేత ఇప్పటికే అనేక విషయాల్లో అక్షింతలు వేయించుకున్న కేసీఆర్ సర్కార్ తాజాగా మరో అంశంలో చీవాట్లు పెట్టించుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్స్ కేటాయింపు విషయంలో తెలంగాణా గృహ నిర్మాణ శాఖ జారీ చేసిన జీవో పై మండిపడింది. గత నెల 15వ తేదీన తెలంగాణా సర్కార్ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ జేసుదాసు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజనం వ్యాజ్యం దాఖలు చేశారు. సోమవారం దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు తెలంగాణా ప్రత్యేక న్యాయవాది మహేందర్ రెడ్డిని నిలదీసింది.

డబుల్ బెడ్ రూమ్ లబ్ధి దారులను కమిటీ ద్వారా ఎంపిక చేయకపోవడాన్ని తప్పు పట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి బోస్లే, జస్టిస్ రవికుమార్ తో కూడిన ధర్మాసనం, ప్రజల నుండి ఏ విధంగా దరఖాస్తులు స్వీకరిస్తారని న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రస్తుతం జారీ చేసిన జీవోను రద్దు చేసి, వెంటనే కొత్త జీవోను జారీ చేయాలని ఆదేశించింది. ఈ నెలాఖరు లోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలని ఆదేశిస్తూ, కేసు విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణా సర్కార్ పై హైకోర్ట్ తీసుకుంటున్న చర్యలు కేసీఆర్ “అనుభవ రహిత” పాలనకు నిదర్శనమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.