KCR GHMC electionsతన ఉద్వేగపూరితమైన ప్రసంగాలతో తెలంగాణా వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండాను రెపరెపలాడేలా చేసిన కేసీఆర్ హైదరాబాద్ లో మాత్రం తన ప్రభావాన్ని చాటుకోలేకపోయారు. అందుకే అధికారం వచ్చిన నాటి నుండి గ్రేటర్ పరిధిలో కొలువు తీరినటువంటి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు గాలం వేయడం ప్రారంభించారు. ఈ దిశగా కేసీఆర్ ఏ మాత్రం సక్సెస్ సాధించారో రెండు రోజుల క్రితం సాయన్న చేరికతో అర్ధం చేసుకోవచ్చు.

రాజకీయంగా గ్రేటర్ లో బలోపేతం అవ్వడంతో… ఇక తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి ప్రజలను ఆకర్షించడం వైపుకు మళ్ళింది. ఈ ప్రక్రియలో భాగంగానే విద్యుత్ మరియు నీటి నాలాల బకాయిలను మాఫీ చేస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. విద్యుత్ బకాయిలకు సంబంధించి 128 కోట్లు మరియు మంచినీటి బకాయిలకు 290 కోట్లు మాఫీ చేస్తామని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అది ముగిసిన వెంటనే ఉత్తర్వులు విడుదల చేస్తామన్నారు.

తెలంగాణా రాష్ట్రానికి ఉన్న రెవిన్యూ దృష్టిలో పెట్టుకుంటే కేసీఆర్ ప్రకటించింది పెద్ద మొత్తం కాకపోయినప్పటికీ, దీని ద్వారా దాదాపు 6 లక్షల గృహ వినియోగదారులు లబ్ధి పొందనున్నారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలలో భాగంగానే కేసీఆర్ ఈ ప్రకటన చేసి ఉంటారని ప్రత్యేకంగా చెప్పనసరం లేదేమో..!