KCR follows Chandrababu Naidu‘కర్ణుడి చావుకు సవా లక్ష కారణాలు’ అన్న రీతిలో 2019లో చంద్రబాబు ప్రభుత్వం అధికారం కోల్పోవడం వెనుక కూడా అన్నే కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది… కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీతో అమీతుమీ తేల్చుకోవడం! రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా బీజేపీ సర్కార్ ‘పొమ్మనక పొగపెట్టిన’ వైనంతో విసిగిపోయిన చంద్రబాబు ఏకంగా ఒక మినీ దండయాత్రే చేసారు. దాని పర్యవసానమే… అధికారం కోల్పోవడం..!

తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ప్రస్తుతం ఇదే రూట్ లో పయనిస్తున్నట్లుగా కనపడుతోంది. ఇటీవల జరిగిన హుజురాబాద్ ఎన్నికల ఫలితాలతో వరుసగా రెండు రోజులు ప్రెస్ మీట్ నిర్వహించి, బీజేపీపై దండయాత్ర చేసిన కేసీఆర్, నీటి పరిష్కార సమస్యల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యాఖ్యలు చేసారు. దీనికి కౌంటర్ గా తాజాగా కేంద్రమంత్రి షెకావత్ ప్రెస్ మీట్ నిర్వహించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కార్నర్ చేసే ప్రయత్నం చేసారు.

ఏపీ-తెలంగాణ మధ్య ఉత్పన్నం అయిన నీటి సమస్యల కోసం ఏర్పాటు చేయాల్సిన కొత్త ట్రైబ్యునల్ ఆలస్యానికి కారణం కేసీఆరే అని, ఓ పక్కన సుప్రీంకోర్ట్ కు వెళ్ళింది కేసీఆరే అని, కోర్టులో ఉన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోకుండా 8 నెలల పాటు కాలయాపన చేసారని, ఇపుడు కేంద్రాన్ని విమర్శించడం తగదని, ప్రజలకు ఈ విషయాలు తెలియజేసేందుకే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసానని కేంద్ర జలశక్తి శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పుకొచ్చారు.

ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా… రాజకీయంగా ఎవరి వాదనలు ఎలా ఉన్నా… బీజేపీ – టీఆర్ఎస్ ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం అయ్యాయన్నది మాత్రం సుస్పష్టం! ఒక విధంగా చెప్పాలంటే నేడు తెలంగాణాలో జరుగుతున్న సంఘటనలు నాలుగేళ్ళ క్రితం ఏపీలో జరిగిన స్మృతులను జ్ఞప్తికి తెస్తున్నాయి. విశేషం ఏమిటంటే… నాడు చంద్రబాబుకైనా… నేడు కేసీఆర్ కైనా బీజీపీపై రాజకీయ యుద్ధం చేయడం అనేది అనివార్యం అయ్యింది. పరిస్థితులు అలా దారి తీసాయి మరి!