KCR Flex Banners on APతెలంగాణ సిఎం కేసీఆర్‌ తన టిఆర్ఎస్‌ పార్టీ పేరుని భారత్‌ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్‌)గా మార్చుకొని జాతీయ రాజకీయాలలో ప్రవేశించేందుకు సిద్దం అవుతున్నారు. అందుకు టిఆర్ఎస్‌ శ్రేణులు… తెలంగాణ ప్రజలు పండగ చేసుకొంటే ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొందరు ఆయనకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టడం, కేకులు కట్ చేయడం, మిఠాయిలు పంచుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ఎందుకంటే ఆయన తన కలలు నెరవేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసారు. ఆ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ నాయకులపట్ల, ప్రజల పట్ల ఎంత విద్వేషం ప్రదర్శించారో తెలుసు. ఆ సమయంలో హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా ప్రజలు టిఆర్ఎస్‌ను, కేసీఆర్‌ విద్వేషాన్ని చూసి భయంతో గజగజవణికిపోయేరు. హైదరాబాద్‌లో ఇళ్ళు, ఉద్యోగాలు, ఆస్తులు అన్ని విడిచిపెట్టి ఏపీకి ఎలా వెళ్ళగలమని తీవ్ర ఆందోళన చెందారు.

వేలకోట్ల ఆస్తులు గల తెలుగు సినీ పరిశ్రమ కూడా ఏపీకి వచ్చేసేందుకు సిద్దపడిందంటే అప్పటి పరిస్థితులు అర్దం చేసుకోవచ్చు. కానీ మంచి మాటకారి అయిన కేసీఆర్‌ తెలంగాణ టిఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చి “తెలంగాణ సాధన వ్యూహాలలో భాగంగానే నాడు ఆవిదంగా ప్రవర్తించాము తప్ప ఏపీ ప్రజల పట్ల ఎటువంటి విద్వేషమూ లేదని, వారిని కడుపులో పెట్టుకొని చూసుకొంటామని” చెపుతూ ఆనాడు తాను చేసిన అవమానాలను చాలా చక్కగా కప్పిపుచ్చుకొన్నారు.

తెలంగాణలో స్థిరపడిన ఆంద్రా ప్రజలు, సినీ పరిశ్రమ అక్కడి నుంచి ఏపీకి తిరిగిరాలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందున వారికి ఆయన మాటలు స్వాంతన చేకూర్చి ఉండవచ్చు. అక్కడే వారు ఉండక తప్పదు కనుక టిఆర్ఎస్‌కు ఓట్లు వేసి గెలిపిస్తుండటాన్ని ఎవరూ తప్పుపట్టలేరు.

కానీ ఈ ఎనిమిదిన్నరేళ్ళలో కేసీఆర్‌ ఆంద్రాతో ఏవిదంగా వ్యవహరిస్తున్నారు?అని ఆలోచిస్తే ప్రతీ విషయంలోనూ ఏపీతో పేచీలు పెట్టుకొంటూనే ఉండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణ ఎగువన ఉండటంతో గోదావరినదిపై ఇష్టారీతిన సాగునీటి ప్రాజెక్టులు కట్టుకొంటున్నందున దిగువన ఉన్న ఆంద్రాకు తీరని నష్టం జరుగుతోంది. అయినప్పటికీ నీటి పంపకాల విషయంలో కేసీఆర్‌ ఏమాత్రం ఏపీని కనికరించకుండా ఎక్కడికక్కడ అడ్డుకొంటూనే ఉన్నారు. నేటికీ కృష్ణా, గోదావరి ట్రిబ్యూనల్స్‌ మొదలు సుప్రీంకోర్టు వరకు నీళ్ళ పంచాయతీలు నడిపిస్తూనే ఉన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టుపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. రాయలసీమకు సాగు,త్రాగు నీటిని అందించే ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ట్రిబ్యూనల్లో పిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కేసులు వేస్తూనే ఉన్నారు.

విభజన చట్ట ప్రకారం షెడ్యూల్ 9,10లో తెలంగాణ రాష్ట్రంలో వేలకోట్లు విలువచేసే ఉమ్మడి ఆస్తుల పంపకాలు చేయకుండా అడ్డుపుల్లలు వేస్తూనే ఉన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సంస్థలకు సుమారు రూ.6,000 కోట్లకు పైగా బకాయిలు చెల్లించడానికి నిరాకరిస్తున్నారు.

దశాబ్ధాలుగా ఒక్క రాష్ట్రంగా కలిసి ఉండి ఆయన కారణంగానే విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని అమరావతి నిర్మాణపనులు చురుకుగా సాగుతుండటంతో కేసీఆర్‌లో మళ్ళీ ఆందోళన మొదలైనట్లుంది. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మించబడితే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐ‌టి కంపెనీలు అన్నీ ఏపీకి తరలిపోతాయనే భయంతో, మూడు రాజధానుల ప్రతిపాదనతో తన ముందుకు వచ్చిన వైసీపీకి 2019 ఎన్నికలలో పరోక్షంగా సహాయసహకారాలు అందించి, అధికారంలోకి వచ్చేలా చేయగలిగారు. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి ఏవిదంగా మారిపోయిందో అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు.

కేసీఆర్‌ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈవిదంగా శతవిదాల ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ఏపీ ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నప్పటికీ మనవాళ్లు మేల్కొనకపోగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఈ గతి పట్టించిన ఆయనకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు పెడుతుండటం సిగ్గుచేటు.

ఆంధ్రప్రదేశ్‌ను రెండు ముక్కలు చేసి, ఇంతగా దెబ్బ తీసిన కేసీఆర్‌ ఇప్పుడు దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరుతుండటమే విచిత్రం అనుకొంటే, ఆయన తన బిఆర్ఎస్‌ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్ళీ నిసిగ్గుగా ఏపీలోకి అడుగుపెట్టాలనుకొంటుంటే మన “రాజకీయ నిరుద్యోగులు” ఆయనకు మేళతాళలతో ఘనస్వాగతం పలికేందుకు సిద్దపడుతుండటం ఇంకా విడ్డూరం… సిగ్గుచేటు.

ఆనాడు రాష్ట్ర విభజన సమయంలో చేసిన అన్యాయానికి ఏపీ ప్రజలు చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పినా ఇంకా వారిలో చాలామందికి బుద్ధివచ్చినట్లు లేదు. మళ్ళీ తమ స్వార్ద రాజకీయాల కోసం బిఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్దపడుతున్నారు. ఇంత జరిగిన తర్వాత కూడా మనవాళ్ళు ఆంధ్రప్రదేశ్‌లోకి బిఆర్ఎస్‌ రావాలని కోరుకొంటుండటం చూస్తే ఆనాడు కన్యాశుల్కం నాటకంలోని గిరీశం చెప్పిన డైలాగ్ “మనవాళ్ళు వట్టి వెదవలోయ్!” గుర్తుకు వస్తోంది.

చైత్యన్య కృష్ణ (రీడర్)