kcr banner in andhra pradesh‘వచ్చే ఎన్నికల్లో తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని’ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ అందరికీ తెలిసిందే. బహుశా ఈ వ్యాఖ్యలు నిజమని భావించారో ఏమో గానీ తూర్పు గోదావరి జిల్లాలో తెలంగాణా ముఖ్యమంత్రిని అభినందిస్తూ ఫ్లెక్సీ దర్శనమిచ్చింది. అయితే ఇది రాజకీయాలను ఉద్దేశించి వెలిసినది కాదు, కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తూ వెలిసిన బ్యానర్.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించిన సందర్భంలో… “తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల చీకటి జీవితాలలో వెలుగులు ప్రసాదించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట చంద్రశేఖర్ రావు గారెకి మా శతకోటి అభినందనలు” అంటూ తూర్పు గోదావరి జిల్లా, వై.రామవరం మండల కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం కట్టిన ఫ్లేక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

మంచి పని చేస్తే ఎవరినైనా అభినందించడానికి తెలుగు ప్రజలు ముందుంటారని చాటిచెప్పిన ఫ్లెక్సీగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ అంశాన్ని రాజకీయాలకతీతంగా చూడాల్సిన అవసరం ఉందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినపడుతున్నాయి.