kcr first chance for Presidential electionsతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానని శపథం చేసి వివిధ రాష్ట్రాలలో పర్యటించి బీజేపిని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీల అధినేతలను, ముఖ్యమంత్రులను కలిసి అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికలోనే ఎన్డీయేకు పోటీగా బీజేపీయేతర అభ్యర్ధిని నిలబెట్టి గెలిపించుకోవడం ద్వారా తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ కూడా వెలువడింది. కనుక సిఎం కేసీఆర్‌ తన సత్తాను చాటుకోవడానికి తొలి అవకాశం వచ్చినట్లే. కనుక ఆయన ఏమి చేయబోతున్నారని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నేతలతో ఈ అంశంపై లోతుగా చర్చించారు కనుక వారందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని సిఎం కేసీఆర్‌ తప్పక ప్రకటిస్తారా? లేక ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోతారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ నెల 15వ తేదీన రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ అవుతుంది. నామినేషన్ల దాఖలు చేయడానికి గడువు ఈ నెల 29 వరకు ఉంది.

కనుక సిఎం కేసీఆర్‌ ఒకవేళ బీజేపియేతర అభ్యర్ధిని పోటీగా నిలపాలనుకుంటే ఎక్కువ సమయం లేదు. ఆలోపుగానే మళ్ళీ మిత్రపక్షాలను కలిసి ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించాల్సి ఉంటుంది. ఆ తరువాత అతను లేదా ఆమెకు మద్దతు కూడగట్టవలసి ఉంటుంది.

సిఎం కేసీఆర్‌ ఈరోజు ప్రగతి భవన్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు. కనుక ఈ సమావేశంలో చర్చించిన తరువాత రాష్ట్రపతి ఎన్నికలపై టిఆర్ఎస్‌ పార్టీ వైఖరిని, ఒకవేళ ఈ పరీక్షను ఎదుర్కొనేందుకు సిద్దపడుతున్నట్లయితే తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని వివిధ పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేల ఓట్ల విలువ ఆధారంగా రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. ఆ ప్రకారం ఎన్డీయే కూటమికి సుమారు 49 శాతం, దానితో కలిసి నడిచే వైఎస్సార్ కాంగ్రెస్, అన్నాడీఎంకే వంటి ప్రాంతీయ పార్టీలకు సుమారు 20-23 శాతం బలం ఉంది. కనుక ఈ ఎన్నికలలో ఎన్డీయే కూటమి తన అభ్యర్ధిని అవలీలగా గెలిపించుకోగలదు. అయినా ఎన్డీయే కూటమిని ఎదుర్కోగలిగే సత్తా, ధైర్యం తనకుందని సిఎం కేసీఆర్‌ నిరూపించుకోదలిస్తే తప్పకుండా రంగంలో దిగుతారు.

ఈ ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి గెలుపు ఖాయం కనుక ఒకవేళ ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని సిఎం కేసీఆర్‌ నిర్ణయిస్తే మాత్రం రాష్ట్రంలో బీజేపి, కాంగ్రెస్ పార్టీలు ఆయనను ఎద్దేవా చేయడం ఖాయం.

కనుక జాతీయ రాజకీయాలలో ప్రవేశించి తన సత్తా చాటుకోవాలని తహతహలాడుతున్న సిఎం కేసీఆర్‌కు ఇదే తొలి అవకాశం. ఇదే అగ్నిపరీక్ష కూడా. మరి సిఎం కేసీఆర్‌ ఈ విషయంలో ఏవిదంగా ముందుకు సాగుతారో చూడాలి.