KCR-YS Jaganఅసెంబ్లీలో తొలిసారిగా 3డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గోదావరి నదీ జలాలపై ఏపీ సిఎం నిర్మించిన ‘పట్టిసీమ’ ప్రాజెక్ట్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీ సిఎం తనకు మిత్రుడే అంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్… చంద్రబాబు ధైర్యం చేసి ‘పట్టిసీమ’ ప్రాజెక్టును నిర్మించారని, అందుకు అభినందనలు తెలియజేస్తున్నానని సభలో ప్రసంగించి తన హోదాను చాటుకున్నారు.

పోలవరం నుంచి రెండు దిశలకు నీళ్లు వెళ్లేలా ప్రాజెక్టు కట్టాలని తానూ కూడా గతంలో చెప్పానని, ఒక పక్క నుంచి విశాఖపట్టణం వెళ్లే దిశగా నీళ్లు మళ్లించుకోవాలని, అలాగే రెండో పక్క నుంచి రాయలసీమలోని తడ వైపు నీళ్లు తరలించాలని సూచనలు చేసానని అన్నారు. అలాగే ఇవే కాకుండా మధ్య మధ్యలో చిన్న ప్రాజెక్టులు కొన్ని కట్టుకోవాలని కూడా అన్నానని, త్వరలోనే చంద్రబాబును కలిసి పలు ప్రాజెక్టులపై ఒప్పందాలు చేసుకుంటానని కేసీఆర్ చెప్పారు. రైతులు ఎక్కడి వారైనా రైతులేనని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు సుభిక్షంగా ఉండాలని తెలంగాణా ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

పొరుగు రాష్ట్రం నేతకు ఉన్నటువంటి ‘జ్ఞానం’ అదే రాష్ట్రానికి చెందిన ప్రతిపక్ష నేత జగన్ కు లేకపోయిందే… అంటూ జనం ముక్కున వేలేసుకోవడం ఏపీ ప్రజల వంతయ్యింది. పట్టిసీమను వ్యతిరేకిస్తున్న జగన్ పై రెండు రోజుల క్రితమే చంద్రబాబు ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు, అలాగే అందరూ నవ్వుకునేలా వ్యంగాస్త్రాలు కూడా సంధించారు. తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అదే పట్టిసీమ విషయంలో ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోవాలని పరోక్షంగా జగన్ కు హితవుతో కూడిన చీవాట్లు పెట్టారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏదైనా ఒక అంశం గురించి తెలియకపోతే నేర్చుకుంటారు లేదా అవగాహన ఉంటే అందులోని లోటు పాట్లు తెలియచెప్తారు, ఆ లోటుపాట్లు కూడా లేవంటే అభినందలు చెప్తారు. మరి పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకున్న “పట్టిసీమ” విషయంలో జగన్ చేసింది ఏంటి? అన్న ప్రశ్న వస్తే… నేర్చుకునే మాట తనకు ‘తెలియదని,’ మొండిగా వాదించడమే తనకు ‘తెలుసని…’ తెలిసి తెలియని వారికి “ప్రతీక”గా నిలిచే విధంగా జగన్ ఉన్నారని, తనకు తానే చాటుకునే విధంగా మాట్లాడుతున్నారన్న రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి.

ఇలాంటి ప్రతిపక్ష నేత ఉండడం అధికార పక్షానికి ‘వరం’గా మారుతుంటే… ‘విభజన’తో మొదలైన ఏపీ ప్రజల కష్టాలకు ‘జగన్’ రూపంలో మరో కష్టం తోడైనట్లయ్యింది. ‘అదృష్టం దురదృష్టంలా’ వెన్నాడితే ఏపీ ప్రజలు మాత్రం ఏం చేయగలుగుతారులే..?