KCR fires on chandrababu naidu over telenagana politicsతెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీడీపీ కాంగ్రెస్ పొత్తు అనగానే మహాకూటమి అధికారంలోకి వస్తే పాలన అంతా అమరావతి నుండీ ఢిల్లీ నుండి సాగుతుంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణ స్వయంపాలనకు అని చెబుతూ ప్రజలలో సెంటిమెంట్ రేకెత్తించే ప్రయత్నం చేశారు. ప్రజల మీద ఎంత మేర పని చేస్తుందో తెలీదు గానీ తెరాస నేతలు దీనిని గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. దీనితో మహాకూటమి గెలిస్తే కాంగ్రెస్ అభ్యర్ధే ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు ప్రకటించాల్సి వచ్చింది. 13 సీట్లతో టీడీపీ ఇక్కడి రాజకీయాలను ఏం శాసిస్తుంది అని చెప్పుకోవాల్సి వచ్చింది.

అయితే ఉన్నఫళంగా కేసీఆర్ నిన్న మాట మార్చారు. “చంద్రబాబు చేసే సిల్లీ రాజకీయాలతో ఇబ్బందులు పడొద్దు. చంద్రబాబుకు ఏ అవసరం ఉంది? ఇంత కుట్ర చేయాల్నా? ఆయనకు రాష్ట్రం లేదా? పని చేసుకోవాలంటే అక్కడ 175 నియోజక వర్గాలు లేవా? అక్కడ కాకుండా ఇక్కడికొచ్చి ఆయన పోటీ చేసే స్థానాలెన్ని!? 13 సీట్లు. ప్రభుత్వం స్థాపిస్తాడా? ఆయన ఆరుస్తాడా తీరుస్తాడా!? తెలుగు ప్రజల మధ్య ప్రేమ ఉంటే ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టాలా? ప్రశాంతంగా బతికే ప్రజలను విడదీయాలా? సంతోషంగా ఉన్నవాళ్ల మధ్య పంచాయతీలు పెట్టాలా?” అని నిన్న సికింద్రాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ అన్నారు.

దీనితో ఒక్కసారిగా తెరాస శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. నిన్న మొన్నటిదాకా మహాకూటమి గెలిస్తే చంద్రబాబే అమరావతి నుండి పాలన సాగిస్తారని చెప్పించి ఇప్పుడు ఏకంగా 13 సీట్లతో ప్రభుత్వం స్థాపిస్తాడా? ఆయన ఆరుస్తాడా తీరుస్తాడా!? అని అంటే మనం చెప్పిన దానికి మనమే విభేదించడం కాదా అని వారు అనుకుంటున్నారు. దీనిని ప్రజలు గ్రహిస్తే మొదటికే మోసం రావొచ్చు అని వారి భయం. మరో వైపు టీడీపీ కాంగ్రెస్ పొత్తు మరీ ఇంత ప్రభావం చూపిస్తుందా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

“టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడానికి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఇదే తెలుగు దేశం పార్టీని 0.25% ఓట్ల పార్టీగా తీసి పడేసేవారు కేసీఆర్. అంటే కేవలం తన వాగ్ధాటితో టీడీపీని తక్కువ చేసి చూపించేవారా? టీడీపీ బలం సొంతంగా గెలవడానికి సరిపోకపోయినా గణనీయంగానే ఉందా? ఇప్పుడు టీడీపీ కాంగ్రెస్ కలిస్తే వాటి బలం పెరగడంతో ప్రభావవంతంగా ఉన్నాయని కేసీఆర్ భయపడుతున్నారా?,” అని అందరి మెదళ్ళలో తొలుస్తున్న సందేహం.