KCR fires on -BJP governmentఆవు కధలు చాలానే ఉన్నాయి. వాటిలో విద్యార్ధి-ఆవు కధ కూడా ఒకటి. ఈ కధ అందరికీ తెలిసిందే. ఓ పాఠశాల విద్యార్ధికి ఆవు గురించి మాత్రమే బాగా తెలుసు. ఓ రోజు ఉపాధ్యాయుడు తరగతిలో పిల్లలను సముద్రం గురించి వ్యాసం రాయమన్నాడు. పిల్లలందరూ ఎవరికి తెలిసింది వారు రాసుకొచ్చారు.

మర్నాడు పిల్లలందరూ వరుసగా తమ వ్యాసాలు చదవి వినిపిస్తున్నప్పుడు మనోడు లేచి తను రాసుకొచ్చిన వ్యాసం చదివాడు. దానిలో ఏమి రాశాడంటే, “నేను మా నాన్నగారితో కలిసి బీచ్‌కి వెళ్ళాను. అక్కడ నాకు ఓ ఆవు కనిపించింది. దానికి నాలుగు కాళ్ళు, రెండు కొమ్ములు, ఓ తోక ఉన్నాయి. ఆవు సాధు జంతువు…”అంటూ గడగడ చదివేసరికి ఉపాధ్యాయుడు కూడా షాక్ అయ్యాడు.

టిఆర్ఎస్‌ ప్రభుత్వం, పార్టీ నేతల మాటలు కూడా అచ్చం ఇలాగే సాగుతున్నాయి. నిత్యం ఏదో ఓ అంశం తీసుకొని దానిని కేంద్రంతో ముడిపెట్టి, తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. సమస్య ఏదైనా దానికి కేంద్రమే కారణమని విమర్శిస్తుంటారు

నిన్న ఇఫ్తార్ విందులో సిఎం కేసీఆర్‌ కూడా “కేంద్ర ప్రభుత్వం సరిగ్గా పనిచేయడం లేదు. దేశంలో పలు రాష్ట్రాలలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడింది. కేంద్రం అసమర్దత వలన యావత్ దేశం నష్టపోతోంది. అత్యవసరంగా కేంద్రానికి చికిత్స చేయాల్సి ఉందని,” అన్నారు.

కనుక టిఆర్ఎస్‌ నేతలు ఇక నేటి నుంచి ఈ లైన్ తీసుకొని మాట్లాడతారని వేరే చెప్పక్కరలేదు. మొదట ధాన్యం కొనుగోలు గురించి రోజూ కేంద్రాన్ని తిట్టిపోసిన టిఆర్ఎస్‌ నేతలు దానిని పక్కన పడేసి గత కొన్ని రోజులుగా “దేశానికి కేసీఆర్‌ నాయకత్వం అవసరం…దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకొంటున్నారంటూ…” వల్లె వేస్తుండటం అందరూ వింటూనే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో విద్యుత్‌ కొరత ఏర్పడుతోంది కనుక ఈ అంశంపై కేంద్రాన్ని విమర్శించడం ప్రారంభిస్తారేమో?

జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలనుకొంటే సిఎం కేసీఆర్‌ను ఎవరూ ఆపడం లేదు. మరో జాతీయ పార్టీ పెట్టుకునో, బిజెపియేతర పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకోనో జాతీయ రాజకీయాలలో ప్రవేశించవచ్చు. కానీ దానికి ఇంకా కొంత సమయం పడుతుంది. కనుక ఈలోగా తను జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నట్లు, ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకొంటున్నట్లు, దానికి తాను మాత్రమే సమర్దుడిననే విషయం తనతో కలిసి రావాలనుకొంటున్న మిత్రపక్షాలకు ముందే తెలియజేయడానికే గట్టిగా చాటింపు వేసుకొంటున్నట్లున్నారు.

కేసీఆర్‌ నాయకత్వాన్ని టిఆర్ఎస్‌ శ్రేణులు…రాష్ట్ర ప్రజలు కూడా కోరుకొంటుండవచ్చు కానీ ఇతర రాష్ట్రాలలో పార్టీలు, ప్రజలు ఎందుకు కోరుకొంటారు?కేవలం 17 లోక్‌సభ సీట్లు కలిగిన దక్షిణాదికి చెందిన కేసీఆర్‌ నాయకత్వాన్ని 40 నుంచి 80 సీట్లున్న ఉత్తరాది పార్టీలు ఎందుకు అంగీకరిస్తాయి?

ఉత్తరాదిలో సుమారు డజను మంది ప్రధాని పదవి ఆశిస్తున్నారు. వారు ఈ రేసులో నుంచి తప్పుకొని కేసీఆర్‌కు కుర్చీ అప్పజెప్పుతారా?వంటి అనేక ప్రశ్నలకు కాలమే జవాబు చెపుతుంది.

అయితే కేసీఆర్‌ కేంద్రానికి ‘అత్యవసరంగా’ చికిత్స చేయాలనుకొంటున్నానని చెప్పారు కనుక దసరా నాటికి కొత్త సచివాలయం నిర్మాణం పూర్తికాగానే తన కుర్చీలో తనయుడు కేటీఆర్‌ని కూర్చోబెట్టి ఓవైసీని వెంటపెట్టుకొని ‘భారత్‌ రాష్ట్ర సమితి’తో ఢిల్లీకి బయలుదేరుతారేమో?