తెలంగాణ సిఎం కేసీఆర్ టిఆర్ఎస్‌ని బిఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత పక్కా ప్రణాళికతో జాతీయ రాజకీయాలలో పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. అందుకు ఆయన రైతు సంఘాల నేతలని ఎంచుకొన్నారు. ఢిల్లీ శివార్ల వద్ద ఏడాదిపాటు ఆందోళనలు చేసిన రైతులకు కేసీఆర్ సంఘీభావం ప్రకటించడమే కాక, ఆ సందర్భంగా అనారోగ్యంతో చనిపోయిన 700 మందికి పైగా రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున ఆర్ధిక సాయం అందజేసి రైతు సంఘాల నేతలని ఆకట్టుకొన్నారు. అప్పటి నుంచి వారు కేసీఆర్ వెంటనడుస్తున్నారు. వారి సహకారంతో ఇతర రాష్ట్రాలలో రైతు సంఘాల నేతలతో కూడా కేసీఆర్ కనెక్ట్ అయ్యారు.
అందుకే ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయం ప్రారంభానికి ప్రతిపక్ష పార్టీలు ఏవీ రాకపోయినా రైతు సంఘాల నేతలు మాత్రం వచ్చారు. కాంగ్రెస్, బిజెపిలతో అంటకాగుతున్న ఉత్తరాది ప్రాంతీయ పార్టీలతో కేసీఆర్ దోస్తీ కొనసాగిస్తునప్పటికీ వాటితో కొనసాగడం కష్టమే. కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీ, బిహార్‌లో నితీశ్ కుమార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మమతా బెనర్జీ వంటి కొందరు ప్రధాని రేసులో ఉన్న సంగతి తెలిసిందే. కనుక వారి నుంచి కేసీఆర్ తోడ్పాటు ఆశించలేరు. కానీ వారి రాష్ట్రాలలో కేసీఆర్ రాజకీయాలు చేయాలంటే వారి సహకారం తప్పనిసరి లేకుంటే అక్కడ అడుగుపెట్టడం కూడా కష్టమవుతుంది. కనుక వారితో దోస్తీ కొనసాగిస్తూనే ప్రధాని కావాలనే తన లక్ష్య సాధన కోసం రైతులని తన సైన్యంగా ఎంచుకొన్నట్లు భావించవచ్చు. అందుకే ‘అబ్ కే బార్ కిసాన్ సర్కార్’ (ఈసారి కేంద్రంలో రైతు ప్రభుత్వం) అనే నినాదం చేస్తున్నారనుకోవచ్చు.
ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయంలో ఒడిశా, యూపీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర లకు చెందిన రైతు సంఘాల నేతలతో కేసీఆర్‌సుదీర్గంగా చర్చలు జరిపారు. రైతులకి గిట్టుబాటు ధర, గౌరవం, పెన్షన్ అనే మూడు డిమాండ్లతో దేశవ్యాప్తంగా రైతుల సభలు నిర్వహించాలని ఈ సమావేశంలో వారు నిర్ణయించారు. ముందుగా బిజెపి పాలిత మహారాష్ట్రలో కరువు పీడిత ప్రాంతమైన విదర్భ నుంచి ఈ రైతు సభలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆ తర్వాత యూపీ, బిహార్, హర్యానా, ఒడిశా, కర్నాటక తదితర రాష్ట్రాలలో నిర్వహించాలని నిర్ణయించారు. త్వరలో మరోసారి అందరూ సమావేశమై ఈ రైతు సభల గురించి చర్చించుకొని రూట్ మ్యాప్, షెడ్యూల్ ఖరారు చేసుకోవాలని నిర్ణయించారు.