kcr tring to oust modi govt and modi govt trying to oust kcr who will winపౌరాణిక సినిమాలలో ఒకరు అగ్ని బాణం వేస్తే మరొకరు నీటి బాణంతో అర్పేసినట్లుగా ఒక నేరాన్ని మరో నేరంతో అడ్డుకొనే విధానం ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. టిడిపి మహిళా నేత గౌతు శిరీష ఈ విధానాన్ని పూర్వకాలంలోని బార్టర్ విధానంతో పోల్చారు. ఒకప్పుడు కరెన్సీ లేకపోవడం వలన ప్రజలు వస్తుమార్పిడి ద్వారా తమకు కావలసిన వస్తువులను పొందేవారు. ఇప్పుడు రాజకీయాలలో కూడా బార్టర్ విధానంలో నేర మార్పిడి జరుగుతోందని గౌతు శిరీష అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంతకీ విషయం ఏమిటంటే, అటు ఈడీ, సీబీఐ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసు, తెలంగాణలో టిఆర్ఎస్‌ నేతల గ్రానైట్ కంపెనీలలో జరుగుతున్న అవకతవకలపై దర్యాప్తు జరుపుతుంటే, ఇటు తెలంగాణ ప్రభుత్వం నలుగురు టిఆర్ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం (ఫామ్‌హౌస్‌ ఫైల్స్)పై దర్యాప్తు కోసం హైదరాబాద్‌ సిటీ పోలీస్ కమీషనర్ సీవి ఆనంద్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని నిన్న ఏర్పాటు చేసింది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ అధికారులు ఈరోజు అరబిందో గ్రూప్ అధినేత పెన్నాక శరత్ చంద్ర రెడ్డిని బినోయ్ కుమార్‌లను ఢిల్లీలో అరెస్ట్ చేసింది. ఈడీ అధికారులు నిన్న మంత్రి గంగుల కమలాకర్‌తో సహా పలువురు గ్రానైట్ వ్యాపారుల ఇళ్ళు, కార్యాలయాలలో సోదాలు నిర్వహించింది. ఈరోజు హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలోని టిఆర్ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర నివాసంలో సోదాలు చేస్తునాయి. వద్దిరాజు కూడా గ్రానైట్ వ్యాపారంలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సిట్’ నేడు, రేపు ఫామ్‌హౌస్‌ ఫైల్స్ కేసులో అరెస్ట్ అయిన రామచంద్రభారతి, సింహయాజీ, నందా కుమార్‌లను కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది.

కనుక ఒకవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌, గ్రానైట్ కేసుల దర్యాప్తు, మరోవైపు ఫామ్‌హౌస్‌ ఫైల్స్ కేసుల దర్యాప్తు పోటాపోటీగా సాగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ సిఎం కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కనుక ఈడీ, సీబీఐ దర్యాప్తులు ఆమె వరకు చేరుకొనేలోగా, ఫామ్‌హౌస్‌ ఫైల్స్ కేసుతో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను బిగించాలని సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

కనుక ఈ రెండు కేసులలో ఎవరు ఎవరిని దెబ్బ తీస్తారో.. చివరికి ఈ రెండు కేసులు ఏవిదంగా ముగుస్తాయో… లేదా అటకెక్కిపోతాయో రాబోయే రోజుల్లో అందరూ చూడవచ్చు.