KCR entry into national politics with his own planeఅవును. జాతీయ రాజకీయాలలో ప్రవేశించడానికి సన్నాహాలు చేసుకొంటున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ దాని కోసం సొంత విమానం కొనుగోలు చేయబోతున్నారు. పార్టీలో కొందరు నేతలు ఇచ్చిన విరాళాలతో సుమారు 90-100 కోట్లు ఖరీదు చేసే 12 సీట్లు కలిగిన విమానాన్ని కొనుగోలు చేయబోతున్నారు. అక్టోబర్‌ 5వ తేదీన దసరా పండుగనాడు విమానం కొనుగోలుకి ఆర్డర్ పెట్టబోతున్నారు. జాతీయ రాజకీయాల కోసం తరచూ వివిద రాష్ట్రాలు తిరగవలసివస్తుంది కనుక అద్దె విమానంలో తిరగడం కంటే సొంత విమానం కొనుగోలుచేయడం మంచిదని కేసీఆర్‌ భావించి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్‌ 5వ తేదీన సిఎం కేసీఆర్‌ తను స్థాపించబోతున్న జాతీయపార్టీ పేరు, వివరాలను ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ్ళ ఉదయం సిఎం కేసీఆర్‌ సతీసమేతంగా తన ఇష్టదైవం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకొని పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలను స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజలు చేయించిన తర్వాత ఆశీర్వాదం తీసుకొంటారు. రేపు సతీసమేతంగా వరంగల్‌ జిల్లాలోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత కేంద్ర ఎన్నికల కమీషన్‌కు పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు సమర్పించి, దానికి ఆమోదం పొందిన తర్వాత కరీంనగర్ జిల్లాలో భారీ బహిరంగసభ నిర్వహించి తన కొత్త పార్టీ, జాతీయ రాజకీయ ప్రవేశం గురించి ప్రజలకు తెలియజేస్తారు.