Chinna Jeeyar Swamy - KCRచడీచప్పుడు లేకుండా తనకు ఇష్టమైన, అనుకూలమైన స్వామిజీలకు తెలంగాణాలో ఖరీదైన భూములను ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టబెట్టే సంస్కృతి ఈ మధ్య మొదలయ్యింది. దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వచ్చినా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం జియర్ ట్రస్టుకు భూమి కేటాయించడంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.

జీయర్‌ ఇంటిగ్రేటెడ్‌ వేదిక్‌ అకాడమీ (జీవ) కి యాదాద్రి సమీపంలో 2.30 ఎకరాల భూమిని కారు చౌకగా కట్టబెట్టారని పిటిషనర్ ఆరోపించారు. సీహెచ్‌ వీరాచారి అనే స్థానికుడు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి తదితరులను ప్రతివాదులుగా చేర్చారు.

కోట్లు విలువచేసే భూమిని కేవలం రూ.16.5లక్షలకే కేటాయించారని పిటిషన్‌లో తెలిపారు. ఈ వ్యాజ్యం బుధవారం సీజే ఆర్‌ఎస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. మొన్న ఆ మధ్య విశాఖ శారదా పీఠానికి కూడా ఇలాగే భూమి ఇచ్చారు. వీటిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

యాదాద్రి ఆలయానికి దగ్గరలో గల 2.75 ఎకరాల భూమిని కారుచౌకగా కేవలం 16 లక్షలకు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక్కడ ఎకరం మార్కెట్ రేటు 10 కోట్ల పై మాటే. అలాగే విశాఖ శారదా పీఠానికి రెండు ఎకరాల స్థలం కేవలం ఎకరాకు రూపాయికి మాత్రమే కేటాయించారు. కోకాపేటలోని ఈ భూమి ధర ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో దాదాపుగా 12 కోట్లు ఒక ఎకరాకు పలుకుంతుంది. రెండు పర్యాయాలలోనూ సైలెంట్ గా జీ.ఓలు ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం.