KCR discussions with Prakash Raj Prashant Kishorకేసీఆర్ గ‌త కొంత కాలంగా జాతీయ రాజ‌కీయాల మీద ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే పూర్తిగా బీజేపీ, కాంగ్రెస్ వ్య‌తిరేక కూట‌మి వైపుగా ఆయ‌న అడుగులు సాగుతున్నాయి. లోక‌ల్ పార్టీల‌ను క‌లుపుకుని పోయేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా మొన్న త‌మిళ‌నాడు, ఆ త‌ర్వాత ముంబై వెళ్లి స్టాలిన్‌, ఉద్ధ‌వ్ ఠాక్రేల‌ను క‌లిసి చ‌ర్చించారు. అయితే ఇక్క‌డే ఓ పెద్ద ప్ర‌శ్న తెర‌మీద‌కు వ‌చ్చింది. ముంబై వెళ్లిన‌ప్పుడు కేసీఆర్ వెంట ప్ర‌కాశ్ రాజ్ కూడా ఉన్నారు.

అస‌లు ప్ర‌కాశ్ రాజ్‌కు, కేసీఆర్ ప్లాన్‌కు సంబంధం ఏంట‌నే చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ప్ర‌కాశ్ రాజ్‌, ప్ర‌శాంత్ కిషోర్‌లు క‌లిసి చ‌ర్చ‌లు జ‌రిపారు. దాదాపు నాలుగు గంట‌ల పాటు వీరు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జాతీయ రాజ‌కీయాల మీద‌నే వీరు మాట్లాడుకున్న‌ట్టు తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎలాంటి వ్యూహాలు ర‌చించాలో ప్ర‌శాంత్ కిషోర్ తో కేసీఆర్ మాట్లాడారు.

తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్ సాయం తీసుకోనున్నారు కేసీఆర్‌. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న్ను క‌లిసిన‌ట్టు అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. ఇదే మొద‌టిసారి. కాగా ఇటు తెలంగాణ‌లో అటు జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ ప్ర‌భావం ఉండేలా చూసే బాధ్య‌త‌ను ప్ర‌శాంత్‌కిషోర్‌కు, ప్ర‌కాష్ రాజ్‌కు అప్ప‌గించారు కేసీఆర్‌.

వాస్త‌వానికి ప్ర‌శాంత్ కిషోర్ అంటే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త కాబ‌ట్టి కేసీఆర్ ఆయ‌న సాయం తీసుకుంటే ప‌ర్వాలేదు. కానీ ప్ర‌కాశ్ రాజ్‌కు ఎందుకు అంత ప్రాధాన్య‌త ఇస్తున్నార‌న్న‌ది అర్థం కావ‌ట్లేదు. జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌మ్నాయ కూట‌మి దిశ‌గా అడుగులు వేస్తున్న కేసీఆర్‌.. ప్ర‌కాశ్ రాజ్‌ను స‌మ‌న్వ‌య క‌ర్త‌గా ఉప‌యోగించుకోవాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయ‌న‌కు ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తున్నారు.

ఇక కేసీఆర్‌, ప్ర‌శాంత్ కిషోర్ లు క‌లిసి జాతీయ రాజ‌కీయాల్లో ఎలా ముందుకు వెళ్లాలో ప్ర‌కాశ్ రాజ్‌కు కొన్ని సూచ‌న‌లు కూడా చేశారంట‌. ఈ సంద‌ర్భంగానే మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, అలాగే గ‌జ్వేల్ అభివృద్ధిని వారికి చూపించాల‌ని కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. దీంతో వారిద్ద‌రూ క‌లిసి వాటిని ప‌రిశీలించారు. కేసీఆర్ చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప‌థ‌కం, మ‌ల్ల‌న్న సాగ‌ర్‌, గ‌జ్వేల్ అభివృద్ధి, ఇత‌ర కీల‌క ప‌థ‌కాలు అయిన రైతుబంధు, ఇత‌ర స్కీముల‌ను వారికి అధికారులు స్ప‌ష్టంగా వివ‌రించారు. వీటిని జాతీయ రాజ‌కీయాల్లో ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ చాలా పెద్ద ప్లానే వేస్తున్నార‌ని తెలుస్తోంది.