ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటక శాసనసభ ఎన్నికల పరిణామాలపై శనివారం ఆరా తీశారు. ఫలితాల అంచనా సరళిపై ఆ రాష్ట్ర జేడీఎస్ నేత కుమారస్వామితో ఆయన ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. జాతీయ స్థాయిలో భాజపా, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఇటీవల జేడీఎస్ నేతలైన మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిలతో భేటీ అయిన విషయం తెలిసిందే.
దీంతో కేసీఆర్ కుమారస్వామికి ఫోన్ చేసి పరిస్థితులను తెలుసుకున్నారు. ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని, ఎన్నికల తర్వాత తమ పాత్ర కీలకంగా ఉంటుందని ఈ సందర్భంగా కుమారస్వామి సీఎంకు వెల్లడించినట్లు తెలిసింది. కర్ణాటకలో హంగ్ వచ్చి జేడీఎస్ కింగ్ మేకర్ గా అవతరిస్తే ఫెడరల్ ఫ్రంట్ సూత్రాలకు కట్టుబడాలని ఆయన సూచించారట.
ఫలితాలు వచ్చాక తమ రాష్ట్ర, పార్టీ అవసరాలు దృష్టిలో పెట్టుకుని సరైన నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి చెప్పినట్టు సమాచారం. అయితే అటువంటి పక్షంలో జేడీఎస్ కాంగ్రెస్ లేక బీజేపీ పంచన చేరడం ఖాయమని కేసీఆర్ ఆందోళన పడుతున్నట్టు సమాచారం. కాగా మంగళవారం ఫలితాలు వెల్లడికానున్నాయి.