KCR Convoy Car registration nubmers forgedతెలంగాణ సీఎం కేసీఆర్ కాన్వాయ్ శ్రేణిలోని వాహనాలన్నింటికీ ‘టీఎస్ 09 కే 6666’ అనే నంబర్ ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. భద్రత కోసం అలా ఒకే నంబర్ తో కూడిన వాహనాలను వాడుతుంటారు. ఏ కారులో కేసీఆర్ ఉన్నారన్న విషయాన్ని తెలియకుండా చూసేందుకే ఇలా చేస్తారు. ఆయన కాన్వాయ్ లో రెండు టయోటా ప్రాడో, నాలుగు ఫార్చ్యూనర్ వాహనాలు ఉంటాయి.

ఇక ఎవరు వాడుతున్నారో ఏమో గానీ, ‘టీఎస్ 09 కే 6666’ నంబర్ తో హైదరాబాద్ పరిధిలో ఎన్నో వాహనాలు తిరుగుతున్నాయి. అవన్నీ బెంజ్, ఫార్చ్యూనర్, వోల్వో, వోక్స్ వాగన్ వంటి ఖరీదైన కారులు. ఇవేవీ కేసీఆర్ అధికారిక వాహనాలు కాదు. ఈ విషయం ఎలా బయటకు వచ్చిందో తెలుసా? ‘టీఎస్ 09 కే 6666’ నంబర్ గల వాహనం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్టు చెబుతూ, మోటార్ వాహనాల చట్టం ప్రకారం, 7845 చెల్లించాలంటూ ఆన్ లైన్లో చలానాలు కనిపిస్తుండటమే.

ఈ కార్లు కూడా ఒకే రకంగా లేవు. అంటే, కేసీఆర్ కాన్వాయ్ వాహనాల నంబర్ ను చాలా మంది అడ్డగోలుగా వాడేస్తున్నారన్న మాట. అసలు కాన్వాయ్ లో మెర్సిడిస్ బెంజ్ వాహనమే లేకపోగా, ఓ బెంజ్ కారుకు అదే నంబర్ తగిలించుకుని తిరుగుతూ, మితిమీరిన వేగంతో వెళ్లిన ఆరోపణలపై చలాన్ నమోదైంది. కొందరు ప్రజా ప్రతినిధులే నిబంధనలకు విరుద్ధంగా ఇలా నకిలీ నంబర్ ప్లేట్లు తయారు చేయించుకుని పెట్టుకుని తిరుగుతున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇక అడ్డదారిపట్టిన వారు చేసిన ఈ పనికి, చలాన్లు ఎవరు చెల్లించాలి? ఎవరి నుంచి వసూలు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ మొత్తం ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఆ వాహనాల యజమానులను, వాటి అసలు నంబర్లను గుర్తించి, చలాన్లు వసూలు చేసి కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.