Chandrababu-Naidu-KCRసమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే కేసీఆర్‌ ఆయన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి కుట్ర పన్నారంటూ బిజెపి నేత మాజీ మంత్రి ఏ. చంద్రశేఖర్ నిన్న ఓ రహస్యాన్ని బయటపెట్టడం సంచనం సృష్టిస్తోంది. గురువారం నాగోలులోని తట్టిఅన్నారంలోని జెకన్వెషన్‌లో బిజెపి అధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్ధం సంస్మరణ సభ జరిగింది.

దానిలో మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ, “సమైక్యరాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001కి ముందు కేసీఆర్‌ ఆయన ప్రభుత్వాన్ని కూలద్రోయడానికి పెద్ద కుట్ర పన్నారు. దాని కోసం రెండు మూడు నెలలు తెర వెనుక రహస్యంగా ఎమ్మెల్యేలతో మంతనాలు చేస్తూ, తెలంగాణ ఎమ్మెల్యేలలో చీలికలు తెచ్చి మొత్తం మీద నన్ను, బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో సహా మొత్తం 60 మంది ఎమ్మెల్యేలను కూడగట్టారు.

ఎమ్మెల్యేలను కూడగట్టిన తరువాత ఓరోజు రాత్రి కేసీఆర్‌ ఈ పధకం ఎంత చురుకుగా పూర్తిచేయాలో చెపుతూ ఎమ్మెల్యేలందరూ 20 హెలికాప్టర్లలో నేరుగా గవర్నర్‌ వద్దకు వెళ్ళి కలిసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరిస్తున్నామని చెప్పుదాం అని అన్నారు.

చివరిగా ఆయన జ్యోతుల నెహ్రూను కూడా కలుపుకుపోవాలనే ఆలోచనతో ఆయనతో ఈ విషయం చెప్పారు. కానీ అక్కడే ఆయన పధకం బెడిసికొట్టింది. జ్యోతుల వెంటనే వెళ్ళి చంద్రబాబు నాయుడుకి ఈవిషయం తెలియజేయడంతో ఆయన అప్రమత్తమై ఈ గండం నుంచి తృటిలో తప్పించుకొన్నారు. లేకుంటే ఆనాడే చంద్రబాబు నాయుడుని దించేసి కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్దమయ్యారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెపుతున్నానంటే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌కు ఎంత పదవీ కాంక్ష ఉందో మీ అందరికీ తెలియడానికే,” అని చంద్రశేఖర్ చెప్పారు.

2001లో కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరికతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కూలద్రోయాలని విఫలయత్నం చేయడం రాజకీయాలలో సహజమే అని సరిపెట్టుకోవచ్చు. కానీ రెండు రాష్ట్రాలు విడిపోయిన తరువాత కూడా కేసీఆర్‌ మళ్ళీ చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కుట్ర చేశారనేది బహిరంగ రహస్యమే.

గత ఎన్నికలలో కేసీఆర్‌, ఆయన మంత్రులు జగన్మోహన్ రెడ్డికి అన్ని విధాలా సహకరించి చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాకుండా సైంధవుడిలా అడ్డుపడ్డారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే, అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మింపబడుతున్న ఏపీ రాజధాని అమరావతి ఓ కొలిక్కి వచ్చి ఉండేది. దాంతో తెలంగాణకు రావలసిన చాలా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు నేడు అమరావతిలో ఉండి ఉండేవి. అప్పుడు పరిశ్రమలు, పెట్టుబడుల కోసం ఏపీతో నిత్యం తెలంగాణ పోటీ పడవలసి వచ్చేది.

అందుకే ఆయన ఏపీలో చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకొని వైసీపీని అధికారంలోకి వచ్చేలా చేయడంతో కానీ కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన పరిశ్రమలు, పెట్టుబడులను బంగారు పళ్ళెంలో పెట్టి కేసీఆర్‌కు అప్పగిస్తోంది.

ఓ పొరుగు ముఖ్యమంత్రి కుట్రలకు, మరో ముఖ్యమంత్రి అసమర్ధతకు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు భారీ మూల్యం చెల్లించవలసి రావడం చాలా బాధాకరం.