KCR_Chandrababu_Naidu_Jaganమాజీ సిఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సిఎం జగన్మోహన్ రెడ్డిల ఆలోచనా, పాలనావిధానాలు పూర్తి భిన్నమైనవని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి చేసి, సంపద సృష్టించాలని ప్రయత్నిస్తుంటారు. అందుకు ఉదాహరణలుగా హైదరాబాద్‌, అమరావతి కళ్లెదుటే ఉన్నాయి.

సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దాంతో సంపద సృష్టించడం కంటే సంక్షేమ పధకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటం, దాని పర్యవసానాలు అందరూ చూస్తూనే ఉన్నారు. దానిని ఆయన పాలనా విధానమని సరిపెట్టుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే టిడిపిని సమూలంగా టిడిచిపెట్టేయాలని ప్రయత్నిస్తూ సంక్షేమ పధకాల వలన వచ్చిన మంచి పేరును మంటగలుపుకొంటున్నారని చెప్పకతప్పదు.

ఇక్కడ మాజీ సిఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సిఎం కేసీఆర్‌ల గురించి కొన్ని విషయాలు ప్రస్తావించుకోవలసి ఉంటుంది. ముందుగా కేసీఆర్‌ గురించి చెప్పుకొంటే ఆయన రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఓ పద్దతి ప్రకారం కాంగ్రెస్‌, టిడిపిలను నిర్వీర్యం చేశారు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించుకొన్నామో, దాని వెనుక ప్రజల ఆకాంక్షలేమిటో అనాడూ మరిచిపోకుండా గుర్తుంచుకొంటూ, రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపారు. ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. ఇందుకే తెలంగాణ ప్రజలు ఆయనలోని ‘రాజకీయ రాక్షసుడు’ని పెద్దగా పట్టించుకోలేదని చెప్పొచ్చు.

చంద్రబాబు నాయుడు కూడా అభివృద్ధికే చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే కేసీఆర్‌, జగన్‌లాగ తన రాజకీయ ప్రత్యర్ధులని సమూలంగా తుడిచిపెట్టేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి పాలన సాగిస్తుండేవారు. కాస్త రాజాకీయాలు, ఎక్కువ అభివృద్ధి ఆయన విధానంగా ఉండేది. కానీ ఈరోజుల్లో అంత రాజకీయ మృదుత్వం పనికిరాదని తర్వాత తెలుసుకొన్నారు.

మళ్ళీ కేసీఆర్‌ విషయానికి వస్తే, ఆయన ప్రజలు కోరుకొంటున్న అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తూ ప్రజల చేత జేజేలు పలికించుకొంటున్నారు. ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకు పాల్పడకుండానే వాటిని అభివృద్ధి, సంక్షేమ పధకాలతో కూడా ప్రజలకు దూరం చేయవచ్చని నిరూపించి చూపుతున్నారు. పాలకుల నుంచి ప్రజలు ఏమి కోరుకొంటారో కేసీఆర్‌ అదే వారికి ఇచ్చి సంతృప్తిపరుస్తూ తనవైపు నిలుపుకొంటున్నారు.

రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ, కొత్తగా ఇంకా ఎన్ని పుట్టుకొస్తున్నప్పటికీ ప్రజలు కేసీఆర్‌ వైపే నిలుస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్ధులను బలహీనపరిచి నిర్వీర్యం చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రజలెవరూ తనని వేలెత్తిచూపకుండా అభివృద్ధి, సంక్షేమ పధకాలతో కట్టిపడేస్తున్నారు.

కేసీఆర్‌ కూడా అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నారు. కానీ రెండు మూడు పధకాలు తప్ప అన్నీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితికి లోబడి ఉన్నవే… ప్రతీ పధకం కూడా ఆయా వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తున్నవే!ముఖ్యంగా సంక్షేమ పధకాల కోసం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని, రాష్ట్రాభివృద్ధిని, రాష్ట్ర ప్రయోజనాలను కేసీఆర్‌ ఏనాడూ తాకట్టుపెట్టలేదు.

ఇక దళితబంధు వంటి తలకు మించిన భారం ఎత్తుకొన్నప్పటికీ అది కేవలం తన బిఆర్ఎస్ పార్టీ రాజకీయ అవసరాల కోసమేనని అందరికీ తెలుసు. కనుక దాని కోసం లక్షల కోట్లు అప్పులు చేసేయడం లేదు. పార్టీకి లాభం, రాష్ట్రానికి నష్టం కలగకుండా చాలా ఆచితూచి నిధులు కేటాయిస్తూ పధకాన్ని అమలుచేస్తున్నారు.

అంతేకాదు… చంద్రబాబు నాయుడులా కేసీఆర్‌ ఏనాడూ అతి మంచితనానికి పోలేదు. తన చేతికి మట్టి అంటించుకోకుండా రాజకీయ ప్రత్యర్ధులను నియంత్రిస్తూనే ఉన్నారు. అఫ్‌కోర్స్!కుటిల రాజకీయాలు కూడా చేస్తున్నారు. కానీ వాటితో ప్రజలకు నష్టం లేదు కనుక ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. ఒక సమర్ధుడైన పాలకుడు ఏవిదంగా ఉండాలో కేసీఆర్‌ని చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఆయనని అపర చాణక్యుడు అనే పేరొచ్చిందని చెప్పవచ్చు.

ఇప్పుడు మళ్ళీ సిఎం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన కేసీఆర్‌లో ‘రాజకీయ రాక్షసుడు’ని మాత్రమే ఆదర్శంగా తీసుకొని ఏపీలో తన రాజకీయ ప్రత్యర్ధులను నిర్ధాక్షిణ్యంగా అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు తప్ప కేసీఆర్‌ విజయవంతంగా అమలుచేసి చూపుతున్న “అభివృద్ధి, సంక్షేమ మిక్స్ రాజకీయ విధానాలని” పూర్తిగా గ్రహించలేదు. స్వీకరించాలనుకోలేదు!

అందుకే ఏపీలో సంక్షేమ పధకాల పేరుతో ఎన్ని లక్షల కోట్లు జగన్ ప్రభుత్వం పంచిపెడుతున్నా ఇంకా ఐ-ప్యాక్, కేసీఆర్‌ (బిఆర్ఎస్), కేంద్ర ప్రభుత్వం తోడ్పాటు తీసుకోకతప్పడం లేదని చెప్పవచ్చు. కానీ కేసీఆర్‌ ఎవరి తోడ్పాటు అవసరం లేకుండానే కేవలం ప్రజలని, తన మంత్రులు, ఎమ్మెల్యేల సామర్ధ్యాన్ని, తాను చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకొని ధైర్యంగా ముందుకు సాగుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. సిఎం జగన్‌ తన మంత్రులు, ఎమ్మెల్యేలు వారి పనితీరు, సామర్ధ్యాన్ని నమ్ముకొని ఎవరి సాయం లేకుండా ఎన్నికలకి వెళ్ళగలరా?

చివరిగా చంద్రబాబు నాయుడు చేసిన ఓ తాజా ట్వీట్‌ చాలా ఆలోచింపజేస్తుంది. “ఏదైనా మంచి పని కోసం వెనకడుగు వేయకుండా పోరాడితే దాన్ని పట్టుదల అంటారు. కసితో కూల్చడమే లక్ష్యంగా పని చేస్తే దాన్ని సైకోతత్వం అంటారు. రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వాన్నంగా ఉంటే..ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? మీరు ఎలాగూ మారరు. ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు.”