KCR  Telangana Secretariateరెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సెక్రటేరియెట్ కు రానున్నారు. కొత్త సచివాలయ శంకుస్థాపనకు 27వ తేదీని ఇప్పటికే ఖరారు చేసిన సంగతి తెలిసిందే. స్థలం, ఏర్పాట్లు పరిశీలించడానికి ఆయన ఒకట్రెండు సార్లు సెక్రటేరియెట్ కు వస్తారని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. శంకుస్థాపన స్థలం, ఏపీ తిరిగిచ్చేసిన బ్లాక్ లను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశాలున్నాయంటున్నారు. కేసీఆర్ చివరిసారిగా 2017 ప్రారంభంలో సెక్రటేరియెట్ కు వచ్చారు.

2014 ఎన్నికల్లో గెలుపు తర్వాత కొంత కాలం ఆయన సచివాలయం నుంచే పాలన కొనసాగించారు. అయితే, వాస్తు దోషం ఉందని వాస్తు నిపుణులు చెప్పడంతో రెండేళ్లుగా దూరంగా ఉంటున్నారు. 2016 నవంబర్లో బేగంపేట ప్రగతి భవన్ను కట్టినప్పటి నుంచి అక్కడి నుంచే ఆయన పాలన చేస్తున్నారు. కేబినెట్ సమావేశాలు, జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లు, శాఖలపై సమీక్షలను అక్కడి నుంచే చేస్తున్నారు. అప్పట్లో సెక్రటేరియట్ కు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే 2018 ఎన్నికలలో మరోసారి గెలిచి అధికారం చేపట్టారు.

భూమి పూజకు ప్రస్తుతం సీఎంవో, సీఎస్ కార్యాలయాలున్న సమతా బ్లాక్ (సీ బ్లాక్), బీ బ్లాక్తో పాటు హెలిప్యాడ్ స్థలాలను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. హెలిప్యాడ్ ఈశాన్యంలో ఉంది కాబట్టి అదే మంచి ప్లేస్ అని వాస్తు నిపుణులు చెప్పినట్టు సమాచారం. ఈ మూడింటిలో ఒక వేదికను ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఖరారు చేస్తారని అధికారులు చెబుతున్నారు. పూజ, భద్రతా ఏర్పాట్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల కూర్చునేలా ఏర్పాట్లు చేయాలి కాబట్టి, తొందరగానే దీనిపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.