KCR Cabinet ready to take oathగత నెల మొదటి వారంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయినా ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చెయ్యలేదు. ప్రభుత్వం శాసనసభను నిర్వహించకపోవడమే దీనికి కారణం. మరోవైపు అప్పటి నుండీ మంత్రులు కూడా లేకుండానే ప్రభుత్వం నడుస్తుంది. వివిధ వర్గాల నుండి వస్తున్న విమర్శలతో శాసనసభ కార్యదర్శి, అధికారులతో సమావేశమై సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించారు. సంక్రాంతి తరువాత జనవరి 17న సభ జరుగుతుందని సమాచారం.

అనూహ్యంగా ప్రొటెం స్పీకర్ అవకాశం ఎంఐఎంకు ఇవ్వడం గమనార్హం. ప్రొటెం స్పీకర్‌గా మజ్లీస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ నియమితులయ్యారు. ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో చార్మినార్‌ నియోజకవర్గం నుంచి అహ్మద్‌ఖాన్‌ 32,586 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు. 1994 నుంచి వరుసగా ఐదుసార్లు యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ సారి చార్మినార్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.

తమ పార్టీ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయడం పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు ఒవైసీ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్ రేపు ఒక పెట్టుబడుల సదస్సుకు దుబాయ్ పర్యటనకు వెళ్తున్నారు. మళ్ళీ 13న తిరిగి వస్తారు. ఆయన వచ్చిన వెంటనే క్యాబినెట్ విస్తరణ మీద కూడా ఒక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం క్యాబినెట్ లో కేసీఆర్ తో పాటు ఇంకో మంత్రి (మహమూద్ అలీ) మాత్రమే ఉన్నారు.