KCR -Cabinet expansionతెలంగాణాలో మొదటి శాసనసభ సమావేశాలు ఈ నెల 17న మొదలు కాబోతున్నాయి. డిసెంబరులో జరిగిన ఎన్నికలలో గెలిచినా ఎమ్మెల్యేలు ఆ రోజు ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. మరోవైపు మంత్రివర్గ విస్తరణ మీద కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టినట్టు సమాచారం. 18న విస్తరణ జరుగుతుందని సమాచారం. ఈ నెల 19వతేదీన గవర్నర్‌ శాసన సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ సమయానికి సభలో మంత్రులు ఉండాలి. 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాల సమయంలోనూ మంత్రులు మాట్లాడాలి. శాసన సభా వ్యవహారాల వ్యవహారాల మంత్రి కూడా అప్పటికి ఖరారు కావాలి.

దీనితో 18నే మంత్రివర్గ విస్తరణ జరగబోతుందని సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి మంత్రివర్గ కూర్పుపై కొంత స్పష్టత ఇచ్చారు. రెండు దఫాలుగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మొదటి విడతలో ఎనిమిది మందికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం మినహా మిగిలిన జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండే అవకాశం ఉందని సమాచారం. కేటీఆర్‌, హరీశ్‌రావు, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, లక్ష్మారెడ్డి, రేఖానాయక్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, బాల్క సుమన్‌, కొప్పుల ఈశ్వర్‌, ఆరూరి రమేశ్‌, వినయ్‌ భాస్కర్‌, నరేందర్‌రెడ్డి తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

మరోవైపు స్పీకర్ ఎంపికపైనా సీఎం ఇప్పటికే నేతలతో మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటివరకు శాసన సభాపతిగా బీసీ వర్గానికి చెందిన మధుసూదనాచారి ఉన్నందున, అదే వర్గం నుంచి ఈటలకు అవకాశం ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు సమాచారం. స్పీకర్ పదవి పై చాలా మంది ఒక మూఢ నమ్మకంతో విముఖత చూపిస్తుండడంతో ఉప సభాపతిగా ఉన్న పద్మా దేవేందర్‌రెడ్డి ఈ పదవికి ఎంపిక చెయ్యాలని సీఎం భావిస్తున్నారట. పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సభాపతిగా ఎంపిక చేసే అవకాశాలూ కన్పిస్తున్నాయి.