KCR BRS Partyరాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకి కరువా? అన్నట్లు తెలంగాణ సిఎం కేసీఆర్‌ తలుచుకొంటే 5 లక్షల మందితో ఖమ్మంలో బిఆర్ఎస్‌ భారీ బహిరంగసభ నిర్వహించడం కష్టం కాదని నిరూపించారు. ఆ జనాన్ని చూసి ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన అఖిలేశ్ యాదవ్ వంటి నేతలు ఆశ్చర్యపోయారు.

ఈ ఒక్క సభతో కేసీఆర్‌ తన శక్తిసామర్ధ్యాలు ఏమిటో వారికి అర్దమయ్యేలా చేశారు. అంటే దానర్దం కేసీఆర్‌ పిలుపు మేరకు వారందరూ స్వచ్ఛందంగా తరలిరాలేదనే సంగతి వారికీ తెలుసు. మరోవిదంగా చెప్పుకోవాలంటే 5 లక్షల మందిని తరలించడానికి అవసరమైన డబ్బు, యంత్రాంగం, శక్తిసామర్ధ్యాలు తనకి ఉన్నాయని వారు గ్రహించేలా కేసీఆర్‌ చేశారని చెప్పవచ్చు. కనుక జాతీయ రాజకీయాలలో కేసీఆర్‌ చక్రం తిప్పగలరనే నమ్మకం వారికి ఏర్పడినట్లే వారి ప్రసంగాలతో అర్దమవుతోంది.

ప్రాంతీయ పార్టీ అయిన జనసేనని నడిపించుకోవడానికి తాను తప్పనిసరిగా సినిమాలు చేయవలసివస్తోందని దాని అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొంటుండటం అందరూ వింటూనే ఉన్నారు. అటువంటిది కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని ఓ చిన్న గదిలో ప్రారంభమయిన టిఆర్ఎస్‌ నేడు బిఆర్ఎస్‌గా మారి సొంత విమానం, జిల్లాకో పార్టీ కార్యాలయం, ఢిల్లీలో రాజమహల్‌ని తలపించే మరో కార్యాలయం కట్టుకొనే స్థాయికి ఎదిగింది. ఒక్క రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని నడిపించడమే ఎంతో కష్టమనుకొంటే ఓ ప్రాంతీయ పార్టీ జాతీయపార్టీగా మారి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పోటీ చేసే స్థాయికి ఎదిగింది.

మునుగోడు ఉపఎన్నికలు దేశంలోకెల్ల అత్యంత ఖరీదైన ఎన్నికలని మీడియా అభివర్ణించడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఉపఎన్నికలలో టిఆర్ఎస్‌ వందల కోట్లు ఖర్చు పెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కనుక రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలు, దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలలో పోటీ చేసేందుకు ఎన్నివేలు లేదా లక్షల కోట్లు అవసరమో ఊహించుకోవచ్చు. కేసీఆర్‌ అందుకు సిద్దం అవుతున్నారంటే ఆయనకి అంత ఆర్ధిక శక్తి, సామర్ధ్యాలు ఉన్నాయనే కదా అర్దం? అదే విషయం నిన్న ఖమ్మం సభకి జనసమీకరణతో నిరూపించి చూపారనుకోవచ్చు.

కనుక ఇంతకాలం ఉత్తరాది రాష్ట్రాలలో కేసీఆర్‌ నాయకత్వంపై అనుమానాలతో దూరంగా ఉండిపోయిన రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ప్రగతి భవన్‌ ముందు క్యూ కట్టవచ్చు. ఈ విషయం మన ఆంద్రానేతలు చాలా ముందే పసిగట్టారు కనుకనే హైదరాబాద్‌ వెళ్ళి కేసీఆర్‌ వద్ద హాజరువేయించుకొని వచ్చేశారు. త్వరలోనే కేసీఆర్‌ విశాఖపట్నంలో బారీ బహిరంగసభ నిర్వహిస్తారని ప్రకటించారు కూడా. ఆలసించిన ఆశాభంగం కనుక ఏపీలో రాజకీయ నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వెంటనే ప్రగతి భవన్‌కి వెళ్ళి హాజరువేయించుకోవడం మంచిది.