తెలంగాణ సిఎం కేసీఆర్ ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో బహిరంగసభ నిర్వహించగా దానికి భారీగా మరాఠీ ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రం వెలుపల బిఆర్ఎస్ నిర్వహిస్తున్న తొలిసభ ఇదే కావడంతో పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేసుకొని సభని విజయవంతం చేశారు. పలువురు స్థానిక నేతలు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. కేసీఆర్ వారిని ఉద్దేశ్యించి అనర్గళంగా హిందీలో మాట్లాడి ఆకట్టుకొన్నారు.
దేశంలో బొగ్గు, నదీ జలాలు తదితర సహజ వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్టమైన విధానాలు, అనాలోచిత నిర్ణయాలు, రాజకీయ స్వార్ధం కారణంగా దేశం వెనుకబడిపోయి ఉందని, ఆ సంపదని ఆదానీ వంటి వారికి ప్రధాని నరేంద్రమోడీ దోచిపెడుతున్నారని కేసీఆర్ అన్నారు.
గత ఏడు దశాబ్ధాలుగా దేశాన్ని పాలిస్తున్నవారు ఆకర్షణీయమైన నినాదాలు, కబుర్లతో దేశ ప్రజలని మభ్యపెడుతూ కాలక్షేపం చేశారే తప్ప దేశాభివృద్ధి, పేదరిక నిర్మూలన కోసం గట్టి ప్రయత్నాలు చేయలేదన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధిచేసి చూపిస్తానని కేసీఆర్ చెప్పారు.
నాందేడ్ సభతో వేసిన ఈ తొలి అడుగుతో ఇతర రాష్ట్రాలలోకి ఏవిదంగా విస్తరించవచ్చో కేసీఆర్ గ్రహించిన్నట్లే భావించవచ్చు. అక్కడ ఈ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించుకోగానే ముందుగానే సరిహద్దు జిల్లాకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలని నాందేడ్‌కి పంపించారు. వారు స్థానిక నేతలతో మాట్లాడి పార్టీలో చేరేలా ఒప్పించారు. వారి సహాసహకారాలతో భారీగా జనసమీకరణ చేశారు. ఏపీ బిఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ని కూడా ఈ సభకి ఆహ్వానించడం ద్వారా రేపు ఏపీలో ఏవిదంగా సభకి ఏర్పాట్లు చేసుకొని నిర్వహించాలో అర్దమయ్యేలా చేశారని చెప్పవచ్చు.
మహారాష్ట్రలో రైతులు నానాకష్టాలు పడుతున్నారు. నేటికీ అనేకమంది ఆత్మహత్యలు చేసుకొంటూనే ఉన్నారు. ఈ సభకి హాజరైనవారిలో అత్యధికులు గ్రామీణులు, రైతులే. కనుక కేసీఆర్ వ్యవసాయం, సాగునీరు, ఉచిత విద్యుత్, రైతుబంధు, దళితబంధు పధకాల గురించి మాట్లాడి వారిని బాగానే ఆకట్టుకొన్నారు.
కనుక రాబోయే రోజుల్లో కేసీఆర్ ఏపీలో బహిరంగసభ నిర్వహిస్తే, ఏపీ రాజధాని అమరావతి, కొండలా పెరిగిపోతున్న అప్పులు, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల జీతాల చెల్లింపు వంటి ప్రధాన సమస్యలపై మాట్లాడాల్సి ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడగలరా?అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ మాట్లాడినా అది ఆ రెండు పార్టీల ఉమ్మడి రాజకీయ వ్యూహం ప్రకారమే ఉందవచ్చు.
ఎందుకంటే కేసీఆర్ ప్రధానమంత్రి కావాలనుకొంటున్నారు తప్ప ఏపీని ఉద్దరించాలనుకోవడం లేదు. కనుక ఏపీలో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఆయన తోడ్పాటు అందించి భవిష్యత్‌లో వైసీపీ ఎంపీల మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తారు. కర్నాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడతానని కేసీఆర్ మాట ఇచ్చారు. కనుక ఏపీతో సహా అన్ని రాష్ట్రాలలో కేసీఆర్ ఇదే విధానంతో ముందుకు సాగబోతున్నారని భావించవచ్చు.