Telangana-State-KCR-తెలంగాణ సిఎం కేసీఆర్‌కి రాజకీయ వ్యూహాలు రచించి అమలుచేయడంలో అపర చాణక్యుడని పేరుంది. అయితే ఒక్కోసారి ఆ అతిశయమే కొంపముంచుతుంది. మునుగోడు ఉపఎన్నికలకి ముందు నలుగురు బిఆర్ఎస్‌ ఎమ్మెల్యేలని కొనుగోలు చేయబోతూ ముగ్గురు బిజెపి ప్రతినిధులు అడ్డంగా దొరికిపోయారు. ఈ వ్యవహారాన్ని కేసీఆర్‌ తన చేతిలోకి తీసుకొని బాగానే ప్రచారం చేసుకొన్నారు. మునుగోడులో బిఆర్ఎస్‌ అభ్యర్ధిని గెలిపించుకొన్నారు. బిజెపి ప్రతినిధులని జైల్లో వేయించారు. తన ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఈవిదంగా దొడ్డిదారిలో కూల్చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ చాటింపు వేశారు. ఈ కేసు విచారణ పేరుతో ఏకంగా ఢిల్లీలో బిజెపి పెద్దలని కూడా వలేసి పట్టేయాలనుకొన్నారు.

ఇంతవరకు అంతా బాగానే జరిగిపోయింది. అయితే ఆయన అత్యుత్సాహంతో పోలీసులు ఇచ్చిన సమాచారాన్ని ప్రెస్‌మీట్‌ పెట్టి బయటపెట్టేయడంతో కధ అడ్డం తిరిగింది.

ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ముగ్గురు బిజెపి ప్రతినిధులు హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. ఈ కేసు దర్యాప్తుని తెలంగాణ ప్రభుత్వం తన రాజకీయ కక్షలకి, అవసరాలకి వాడుకొంటోందని, కనుక కేసు దర్యాప్తుని సీబీఐకి అప్పగించాలని కోరారు. వారి పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ కేసు దర్యాప్తుకి సంబందించి అన్ని వివరాలని రహస్యంగా ఉంచి కోర్టుకి మాత్రమే సమర్పించాల్సి ఉండగా, ఆ వివరాలు కేసీఆర్‌ చేతికి ఎలా వెళ్ళాయని ప్రశ్నించింది. కనుక ఈ కేసుని సీబీఐకి బదిలీ చేస్తున్నామని, తెలంగాణ పోలీసుల వద్ద అన్ని రికార్డులని వెంటనే సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. ఇది కేసీఆర్‌ కూడా ఊహించని పరిణామమే కనుక ఆయనకిది పెద్ద షాక్ అనే చెప్పవచ్చు.

ఈ కేసు దర్యాప్తు సీబీఐ చేతిలోకి వెళ్ళిపోతే ఇదే కేసుతో కేంద్ర ప్రభుత్వం తమని ఇరుకున పెట్టగలదని కేసీఆర్‌కి బాగా తెలుసు. అందుకే తెలంగాణ ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కానీ ఈ రోజు ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కూడా సీబీఐ ఈ కేసు విచారణని చేపట్టకుండా అడ్డుకోలేమని చెప్పేసింది. అంతేగాదు… సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ పూర్తయ్యేవరకు సీబీఐ ఎవరినీ అరెస్ట్ చేయవద్దని ఆదేశించాలనే తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని కూడా తిరస్కరించింది. ఈ కేసు తదుపరి విచారణని ఈనెల 27కి వాయిదా వేసింది.

ఆనాడు ఓటుకి నోటు కేసులో కేసీఆర్‌ తన రాజకీయ ప్రత్యర్దులని బెదిరించిన్నట్లుగానే ఈ కేసు దర్యాప్తు పేరుతో మోడీ ప్రభుత్వాన్ని నిలువరించి, రాజకీయంగా దెబ్బ తీయాలనుకొన్నారు. కానీ ఈసారి కేసీఆర్‌ ఐడియా బెడిసికొట్టడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే ఈ కేసు విచారణ పేరుతో ఆయనతో ఆడుకోబోతోంది.

పొరపాట్లు: వందల కోట్లతో ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలని కూల్చివేయాలని బిజెపి ప్రయత్నించడం తప్పే. రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానని చెప్పుతున్న కేసీఆర్‌, పోలీస్ వ్యవస్థని ఉపయోగించుకొని బిజెపిని దెబ్బతీయాలనుకోవడం పొరపాటే. సీబీఐతో తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనుకోవడం కూడా తప్పే!

గుణపాఠం: రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలని పక్కన పెట్టేస్తే చివరికి ఇలాంటి పరిణామాలే ఎదుర్కోవలసి వస్తుంది. వాటికి వారే బలవ్వాల్సి వస్తుంది అనేది ఈ కేసు నేర్పుతున్న గుణపాఠం. కానీ ఇటువంటి గుణపాఠాలు నేర్చుకొనే స్థితిలో ఎవరూ లేరు కనుక పర్యవసానాలని అందరూ అనుభవించాల్సిందే!